మండల పూజల నిమిత్తం కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయ ద్వారాలు తెరుచుకున్న తొలి రోజే వివాదం చెలరేగింది. భారీ బందోబస్తు మధ్య ఆలయ ద్వారాలను ఆలయ ప్రధాన పూజారి కందరారు మహేశ్ మోహనర్, మేల్ తంత్రి సుధీర్ నంబూద్రి, శనివారం సాయంత్రం 5 గంటలకు తెరిచి, తొలి పడి పూజలను నిర్వహించారు.


కేరళతో పాటు తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తుల అయ్యప్ప శరణుఘోషతో ఆలయ పరిసరాలు మారు మోగాయి. కాగా, ఏపీ నుంచి ఆలయానికి వచ్చిన 10 మంది యువతులకు నచ్చజెప్పి, వెనక్కు పంపినట్టు పోలీసులు వెల్లడించారు. కీలక ప్రాంతాల్లో సుమారు 10 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆలయం వద్ద రద్దీ పెరిగిన పక్షంలో నీలక్కల్, పంబ తదితర ప్రాంతాల్లో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.


విజయవాడ నుంచి 30 మంది మహిళల బృందం స్వామి దర్శనానికి రాగా, వారి గుర్తింపు పత్రాలను పరిశీలించి, 10 మందికి పంబ నుంచి సన్నిధానానికి వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. వీరు 10 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న వారని ధ్రువీకరించిన తరవాతనే వెనక్కు పంపినట్టు పోలీసులు స్పష్టం చేశారు. కేరళ సర్కారు వైఖరిని పునరుజ్జీవన రక్షణ కమిటీ కార్యదర్శి పున్నల శ్రీకుమార్ ఖండించారు. సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నా, మహిళలకు రక్షణ కల్పించి, వారికి స్వామి దర్శనాన్ని కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని మండిపడ్డారు. కోర్టు నుంచి అనుమతి ఉత్తర్వులు తెచ్చుకున్న వారికే ఆలయం వరకూ భద్రత కల్పిస్తామని కేరళ దేవాదాయ మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: