ప్రస్తుత కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నిత్యం శివారాధన చేయడం వలన మనకు ఎప్పుడూ సకల శుభాలు, సౌభాగ్యాలు కలగడమే కాక మనస్సు మరియు ఆరోగ్యం ఎప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉంటుందని అంటున్నారు తత్వవేత్తలు. మహా శివునికి అత్యంత ప్రియమైన ఈ కార్తీక మాస పర్వదినాల్లో, రోజూ వేకువ ఝామునే నిద్ర లేచి, తలారా స్నానం ఆచరించి, శుభ్రమైన దుస్తులు ధరించి, పరమశివునికి పూలు పండ్లు, నైవేద్యం సమర్పించి, నిర్మలమైన మనస్సుతో ఆ కైలాసనాధుని అర్ఘ్య, పాదాలతో పూజిస్తే అయన కృప మనపై ఎప్పటికీ ఉంటుందని ప్రతీతి. అంతేకాదు మన నిత్య జీవితంలో కలిగే బాధలు తొలగి, మనకు అన్నింటా విజయం చేకూరుతుందని చెపుతుంటారు. 

నిజానికి ఈ కార్తీక మాసంలో మనం ఆచరించే కొన్ని పద్ధతుల ద్వారా మన శరీరం, మనస్సు ఆరోగ్యవంతంగా తయారయి మనకు అన్నివిధాలా ఆనందాన్నిస్తాయట. ఇక ఈ కార్తీక మాస పర్వదినాల్లో విఘ్నేశ్వరార్చన, శివార్చన, శ్రీమహా విష్ణువును పూజించడం వంటివి ఎక్కువగా ఆచరించాలట. ఎవరైతే ఎంతో నిష్టగా శివుని పూజిస్తూ రోజూ ఏకభుక్తం చేస్తూ, నేలపడక వంటివి తప్పక ఆచరిస్తారో అటువంటి వారికి అన్నింటా శుభమే జరుగుతుందట. అయితే ఇటువంటివి ఆచరించడం వలన మనకు ఏ విధంగా ఆరోగ్య పరంగా కూడా మేలు చేకూరుతుందంటే, ముందుగా ఉదయాన్నే నిద్రలేవడం వలన ఆ సమయంలో వచ్చే స్వచ్ఛమైన గాలికి మనసు తేలికపడుతుందట. అంతేకాదు ఆ సమయంలో స్నానం ఆచరించడం వలన చర్మంపైన ఉండే మృతకణాలు తొలగి చర్మం దృఢంగా కాంతివంతంగా మారుతుంది. ఇక దేవతా సమయంగా చెప్పబడే వేకువఝాము సమయంలో మనస్సు నిర్మలంగా ఉంటుంది కనుక, ఆ సమయంలో దైవాన్ని ప్రశాంత మనస్సుతో పూజించడం వలన దైవకృప మనపై తప్పకుండా ఉంటుందట. 

ఇక ఏకభుక్తం వలన కూడా మన శరీరానికి ఎంతో మేలట. నిత్యం రెండు పూటలా తినే మనకు ఇలా కొద్దిరోజులపాటు ఏకభుక్తం ఉండడం చిన్నపాటి ఇబ్బందిగా ఉన్నప్పటికీ, దాని వలన ఉదరంలోని దోషాలు తొలగి శరీరం తేలికపడుతుందట. ఇక నిద్ర సమయంలో నేలపడక వలన శరీరంలో ముఖ్యంగా వెన్నెముక సమస్యలు కొంత ఉపశమించి, రక్తప్రసరణ బాగా జరుగుతుందని చెప్తున్నారు. కావున ఈ కార్తీక మాసం సమయంలో మనం చేసే ఈ శివార్చన మరియు పాటించే నియమాల వలన మనకు సకల శుభాలు సిద్దించడంతో పాటు, మన మనస్సుకు శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పబడుతోంది.....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: