స్వామీయే శరణం అయ్యప్ప అనే శరణు ఘోషతో మారుమోగుతున్నాయి శబరిగిరులు. మండల ధీక్షలు తీసుకున్న స్వాములు... అయ్యప్ప సన్నిధికి పోటెత్తుతున్నారు. మరోవైపు.. మహిళల ప్రవేశంపై వివాదం కొనసాగుతుండడంతో.. ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం.


శబరిమలలో అయ్యప్ప దర్శనం రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతోంది. మండల పూజ కోసం శనివారం సాయంత్రం ఆలయ ద్వారాలు తెరిచిన ప్రధాన పూజారి కండారు మోహనారు, ముఖ్య పూజారి ఎ.కె.సుధీర్‌ నంబూద్రి ఆలయ శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేశారు. పంబ నుంచి దీక్ష స్వీకరించిన స్వాములు దర్శనానికి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా కేరళ సర్కార్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. కొందరు మహిళలు ప్రచారం కోసమే శబరిమల వెళ్తామని ప్రకటించడంతో.. వారిని అనుమతించమని చెప్పింది కేరళ ప్రభుత్వం. దీంతో 50 ఏళ్ల లోపు వయస్సున్న మహిళలను అనుమతించబోమని తేల్చేశారు పోలీసులు. 


గతేడాది జరిగిన ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకొని ఈసారి కేరళ ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలు వెళ్లాలనుకుంటే అందుకనుగుణంగా కోర్టు ఉత్తర్వులు తెచ్చుకోవాలని చెప్పింది సర్కార్‌. మరోవైపు.. డిసెంబర్‌ 27 వరకు శబరిమలలో నిత్య పూజలు జరుగుతాయి. ఆ తర్వాత మూడు రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి డిసెంబరు 30న మకరవిళక్కు ఉత్సవాల కోసం ఆలయ తలుపులు తెరుస్తారు. జనవరి 20వ తేదీ వరకు పూజలు కొనసాగుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: