తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని టీటీడీ నిర్ణయించుకుంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న దేవస్థానం మరో అడుగు ముందుకు  వేసింది. కలియుగ వైకుంఠాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చదిద్దే ప్రణాళికలో భాగంగా భక్తులకు జ్యూట్‌ బ్యాగులను అందుబాటులోకి తీసుకొచ్చింది. లడ్డూల కవర్ల విషయంలో ప్లాస్టిక్‌ కవర్ల వినియోగాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు కూడ చేపట్టింది.

 

 

అందులో భాగంగా ప్లాస్టిక్ కవర్లను నిషేధించి, వాటికి ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగులు, పేపర్‌ బాక్స్‌లను ప్రవేశపెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది కాని, వీటి ధరలు మాత్రం భక్తులకు హై వోల్టేజీ షాక్ ఇస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లకు బదులు పర్యావరణ అనుకూలమైన ఈ బ్యాగుల ధరలను గమనిస్తే 5 లడ్డూల సామర్థ్యం ఉన్న బ్యాగు ధర రూ.25.. పది లడ్డూల బ్యాగు రూ.30.. 15 లడ్డూల బ్యాగు రూ.35.. 25 లడ్డులది రూ.55గా నిర్ణయించారు. వీటితో పాటుగా అట్టపెట్టలలో కూడా లడ్డూలను అందిస్తున్నారు.

 

 

వీటిలో ఒక లడ్డూది రూ.3, రెండు లడ్డూలది రూ.5, నాలుగు లడ్డూలది రూ.10గా ధరల పట్టికలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గతేడాది నవంబరులోనే లడ్డూల కోసం అట్టపెట్టెలను తీసుకురావాలని టీటీడీ భావించింది. అయితే ఈ విధానం వల్ల టీటీడీ ఆదాయానికి గండిపడే ప్రమాదం ఉండటంతో జ్యూట్ బ్యాగులను కూడా అందుబాటులోకి తెచ్చింది.

 

 

ఇక ఇప్పటివరకు ఎక్కువ లడ్డూలు కొనుగోలు చేసే భక్తులు వాటిని తీసుకెళ్లేందుకు డబ్బులు పెట్టి కవర్లను కొనుగోలు చేసేవారు. ఇప్పుడు చాలా మందికి ఈ పేపర్ బ్యాగుల భారం అధనంగా పడుతుంది.. ఇక జ్యూట్ బ్యాగులు, గాని బాక్సుల్లో గాని లడ్డూలు పెట్టడం వల్ల వాటి నాణ్యతలో ఎలాంటి మార్పు ఉండబోదని టీటీడీ తెలిపింది.

 

 

పేపర్ బాక్సుల్లో లడ్డూ సుమారు పది రోజుల పాటు తాజాగా ఉంటుందని తెలిపారు. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలనుండి టీటీడీ రోజుకు సుమారు 10వేలకుపైగా ప్లాస్టిక్ కవర్లను భక్తులకు అందజేస్తుండగా, వాటి స్థానంలో ఇప్పుడు పేపర్ బాక్సులు, జ్యూట్ బ్యాగులను తీసుకొచ్చారు... ఈ విధానం బాగున్నప్పటికి ఎంతమేరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి అంటున్నారు కొందరు.

మరింత సమాచారం తెలుసుకోండి: