భద్రాచల రామయ్యకు కాసుల కష్టం వచ్చిపడింది. భక్తుల కానుకలపైనే ఆధారపడ్డ అందరి బంధువుకు ఆదాయం భారీగా తగ్గిపోయింది. ఆర్టీసీ సమ్మె ప్రభావంతో భక్తుల రాక తగ్గిపోయింది. దీంతో ఆదాయం తగ్గి ఆలయ సిబ్బందికి జీతాలివ్వడమే కష్టంగా మారింది. పేద రాముడిగా మారిన భద్రాచల రామయ్యను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుందా? 

 

దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం దేవస్థానం ఆదాయం భారీగా పడిపోయింది. భక్తుల సంఖ్య తగ్గడంతో ఆ ప్రభావం హుండీ ఆదాయంపైనా పడింది. దీంతో... శ్రీరాముడికి లక్ష్మీకటాక్షం తగ్గిపోయింది. గత 57 రోజులకు సంబంధించిన స్వామి వారి  హుండీలను అధికారులు లెక్కించారు. హుండీల ద్వారా 75 లక్షల 89 వేల ఆదాయం మాత్రమే సమకూరింది. నగదుతో పాటు 50 గ్రాముల బంగారం, కేజీ  ముప్పై ఎనిమిది గ్రాముల వెండిని రామయ్య హుండీలో భక్తులు కానుకల రూపంలో సమర్పించారు. అమెరికా...సౌదీ...శ్రీలంక...నేపాల్...ఒమన్...కువైట్...యూఏఈ లాంటి దేశాలకు చెందిన కరెన్సీ కూడా భద్రాద్రి రాముడి హుండీ లెక్కింపులో బయటపడింది. 

 
భద్రాద్రి ఆలయ నిర్వహణ ప్రధానంగా భక్తులు ఇచ్చే కానుకలపైనే ఆధారపడింది. హుండీలు తెరిస్తేనే జీతాలు చెల్లించే పరిస్థితి ఆలయంలో ఉంది. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం రామయ్యకు హుండీ ద్వారా వచ్చిన ఆదాయం దేవస్థానం ఉద్యోగుల జీతభత్యాల చెల్లించేందుకే పూర్తిస్థాయిలో సరిపోదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేవస్థానం సిబ్బంది, ఉద్యోగులకు నెలకు కోటిరూపాయల వరకు జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ  పరిస్థితుల్లో ఈసారి వేతనాల చెల్లింపు ఎలా అనేది అర్థం కాని ప్రశ్నలా మారింది. 

 

ఆర్టీసీ సమ్మె ప్రభావం భద్రాద్రి రామయ్యపై భారీగానే పడింది. మామూలు రోజుల్లోనే హుండీ ఆదాయం నెలకు సుమారు రూ.60 లక్షల వరకూ వస్తుంటుంది. ఈ ఆదాయం సమ్మె వల్ల ఈసారి రూ.37 లక్షలకు పడిపోయింది. ఈ సీజన్‌లో సెప్టెంబరు 18న చివరిసారిగా హుండీ తెరిచారు. అప్పుడు భద్రాద్రి రామయ్యకు 79 రోజులకు కోటీ రూ.10లక్షల ఆదాయం సమకూరింది. ఆ సమయంలో ఏపీలోని కచ్చులూరు బోటు ప్రమాదం ప్రభావంతో  కొంత ఆదాయం తగ్గింది. ఇటు...తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మెతో భద్రాద్రికి వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఫలితంగా రామయ్య హుండీ ఆదాయంపై ఆ ప్రభావం తీవ్రంగా పడిందని దేవస్థానం అధికారులు అంగీకరిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులున్న ప్రస్తుత తరుణంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాల నిర్వహణకు కాసుల కటకట తప్పేలా లేదు. డిసెంబరు 27 నుంచి జనవరి 16 వరకు వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు చేసే పనులపై ఈ ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా పడుతుందని దేవస్థానం వర్గాలు అంగీకరిస్తున్నాయి. మొత్తానికి...నిధుల కొరతతోభద్రాచలం ఆలయంలో భవిష్యత్తులో చేపట్టబోయే వివిధ కార్యక్రమాలకు ఆటంకాలు తప్పేలా లేవు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆదుకుంటేనే రామయ్యకు చేసే సేవలన్నీ యథావిధిగానే జరిగే అవకాశాలున్నాయి. లేకపోతే అరకొర నిధులతోనే ఆలయంలో జరిగే వేడుకలను సరిపెట్టుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: