ఒక మనిషి తన స్వార్దం కోసం ఎంతలా దిగజారుతున్నాడో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఇక తాను చేస్తున్న తప్పిదాలకు పరిహారంగా పూజలు, హోమాలు, చేస్తూ తనను తాను సంతృప్తి పరచుకొంటున్నాడు. ఇక పాపం అనేదు జేబులో ఉన్న డబ్బు వంటిది. ఇదెలా అంటే ఒక వ్యక్తి తన జేబులో  పది రూపాయల నోటు వేసాడంటే పది సంవత్సరాలైన అక్కడ పది నోటు కనిపిస్తుందే కాని పదికి ఇరవై, ముప్పై కావు. అలాగే మానవుడు మోసుకుంటున్న పాపఖర్మలు  ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉంటాయి గాని పాప పరిహారం జరగదు.

 

 

అంటే ముందుగా మనిషి ఆలోచనల్లో, నడవడిలో మార్పూ రావాలి గాని చేసే పాపాలన్ని చేసి దేవుడా అంటే ఆ పాపాలు మంచులా కరిగిపోతాయా? ముందుగా మానవుడు తెలుసుకోవలసింది తాను ఎవరు?. ఎందుకు మానవ జన్మ ఎత్తాడు?. అసలు ఈ జన్మపొందడానికున్న ఉద్దేశ్యం ఏంటో స్పూరించేలా ఆలోచించాలి. కాని నేడు మనిషిగా పుట్టింది తనలోని కామ, క్రోద, మోహ మదమత్సరాలను సంతృప్తి పరచడానికే అన్నట్లుగా బ్రతుకుతున్నాడు.

 

 

ఇక్కడికి వచ్చే ముందు నీదంటూ ఏముంది. నీవు దేహాన్ని వదిలి వెళ్ళే ముందు నీ వెంట వచ్చేది ఏముంది అన్నీ శ్మశానం వరకే అక్కడ నీవొక్కడివే నిదురించాలి ఇన్నాళ్ళూ నీవు మోసాలు చేసి సంపాధించింది నీతో వచ్చిందా? నా వాళ్లూ అనుకున్న వారు నీ చావుని ఆపగలిగారా? లేక నీ మరణాన్ని వారు పంచుకున్నారా? మరి భూమిమీద ఉన్నంతకాలం నువ్వు చేసే పోరాటం దేనికోసం. పోయేవరకు కూడా నిన్ను నువ్వు తెలుసుకోకుండానే కన్ను మూస్తావు. ఇకపోతే తన్ను వీడి తాను నిలుచు తత్త్వమే నిత్యం. తన్ను వదలటం. తత్త్వమసి. మూలం...

 

 

చావు పుట్టుకలు పరమార్ధంలో ఆత్మ అజం, అమరం.  అలాగే జన్మ కారణోపాది కారణ శరీరము దగ్ధము కానంతవరకు పునరపి జననం, పునరపి మరణం తధ్యం. ఈ దేహంతో ఉన్నపుడే సత్యాత్మ దృష్టిని స్ధిరపరచుకోవాలి. దేహాభిమానం ఉన్నంతకాలం మృత్యుభయం వెంటాడుతుంది. నిద్రను ఎలాగైతే హాయిగ కోరుకొంటామో మృత్యువును అలాగే ఆహ్వానించాలి. సర్వ స్వతంత్రమైన సత్యాత్మ జ్ఞాని దేహ మరణానంతరం సైతం స్వత:స్సిద్ధముగ ఉంటాడు. ఇదియే సరియైన ఆత్మ స్ధితి. కాని మనస్సుతో చేయని భగవంతుని పూజలు కూడా ఎలాంటి  ఫలితాలనివ్వవు.

 

 

దీనినిబట్టి చూస్తే పూజారులు, మధ్యవర్తులు అవసరం లేకుండా మనం దేవునితో సరాసరి అనుసంధానం కావచ్చు. దానికి మనస్సును ఆపాలి. ఆలోచనలను ఆపాలి. చెయ్యగలిగితే, మహామౌనంలో ఉండగలిగితే దేవునితో టక్కున అనుసంధానం కలుగుతుంది ముక్తిని సాధించుటకు అనేక మార్గములు గలవు. అందులో భక్తి మార్గము అత్యంత సులువైనది. భగవంతుని నామాన్ని జపిస్తూ, రూపాన్ని ధ్యానిస్తూ చేసే పూజలను, ఉపాసనలను భక్తి అంటారు.

 

 

భక్తి యోగంలో జీవుడు దేవున్ని ఎల్లవేళలా స్ధుతిస్తూ భగవన్నామ సంకీర్తన చేస్తూ ఉంటాడు.మనస్సును, బుద్ధిని పరమాత్మయందు స్ధిరముగ నిలుపవలెను. మనస్సు సంకల్పించును. బుద్ధి నిశ్చయించును. కాబట్టి భగవంతుని విషయమై దృఢమగు నిశ్చయమును కలుగజేయునది బుద్ధియే. కావున దానిని కూడ మనస్సులో చేర్చవలెను. అట్లు మనో బుద్ధుల రెండింటిని ఇతరమైన దృశ్య వస్తువులయందు ప్రవేశింపనీయక, ఒక్క భగవంతునియందే లగ్నమై యుండు విధముగా ప్రయత్నింపవలెను.

 

 

అట్లు చేసినచో భక్తుడు ధ్యేయ వస్తువగు ఆ పరమాత్మయందే సదా నివసింపగలడు. ఇది ఎలాగా అంటే ఉప్పు సముద్రము నందు లయించునట్లు మనస్సు నిరంతరము దేనిని గూర్చి ధ్యానించునో, దేనియందు లగ్నమై యుండునో దాని యందే లయించి తదాకారమగును. కావున ఎల్లప్పుడు భగవంతుని యందు స్ధిరముగ ఉండునట్టి మనస్సు క్రమముగ ఆ దైవాకారమునే పొందును. ఇదియే సత్యము.

 

మరింత సమాచారం తెలుసుకోండి: