తొమ్మిది రోజుల ఉత్సవం..! 16  వాహనాల్లో విహారం...! వివిధ రూపాల్లో భక్తజన కోటికి అనుగ్రహం...! బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ అమ్మవారి వైభవాన్ని కళ్లారా చూడాలే తప్ప, మాటల్లో చెప్పేది కాదు. ఈ రోజు నుంచి ప్రారంభమైన తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలపై ఎన్నో విశేషాలున్నాయి.   


తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి స్వామివారితో సమానంగా ఉత్సవాలకు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారికి వైఖానస ఆగమోక్తంగా నిత్యపూజలు, ఉత్సవాలను నిర్వహిస్తే.. అమ్మవారికి పాంచరాత్ర ఆగమోక్తంగా ఉత్సవాలను జరుపుతారు. ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాలు అమ్మవారు ఒక్కరే తిరుమాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.

 

నేటి నుంచి ప్రారంభమైన తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు డిసెంబర్  1 వరకూ జరిగే ఉత్సవాల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ధ్వజారోహణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ధ్వజాఅవరోహణంతో ముగుస్తాయి. అమ్మవారి సమక్షంలో ధ్వజస్తంభం పై గజపటాన్ని ఎగురవేస్తారు అర్చకులు. ఈ రాత్రి  చిన్నశేష వాహన సేవ ఉంటుంది. 

 

బ్రహ్మోత్సవాలలో వాహనాల విషయానికి వస్తే... రెండో రోజు పెద్దశేషవాహనం, హంసవాహనంపై అమ్మ విహరిస్తుంది. మూడోరోజు ముత్యపు పందిరి, సింహవాహనం, నాలుగోరోజు కల్పవక్ష వాహనం, హనుమంతు వాహనం, ఐదోరోజు పల్లకీ సేవ, గజవాహన సేవలు ఉంటాయి. గజవాహన సేవ వేళ అమ్మ దర్శనానికి రెండు లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక ఆరో రోజు సర్వభూపాల వాహనం, గరుడ సేవ, ఏడవరోజు సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు ఉంటాయి. చివరి రెండురోజులు వరసగా రధోత్సవం, అశ్వవాహన సేవలు ఉంటాయి.  

 

అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టం పంచమీ తీర్థం కన్నులపండువగా సాగుతుంది. ఇక పద్మావతీ బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు... వెంకటేశ్వర స్వామి తిరుచానూరులోనే ఉంటూ... కనులారా వీక్షిస్తారన్నది భక్తుల విశ్వాసం. ఉత్సవాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది దేవస్థానం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: