ఆదోని పట్టణ శివారులో రణమండల కొండల్లో 600 అడుగుల ఎత్తులో తూర్పు దిక్కున ఉద్భవించిన రణమండల ఆంజనేయస్వామి కొలిచే వారికి ఆరాధ్యదైవంగా వెలుగొందుతున్నాడు. ఈ కొండ ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. శ్రావణ, కార్తీక మాసాల్లో ప్రతి శనివారం నిత్యం భక్తులతో కిలకిటలాడుతు ఉంటుంది.

 

స్వామి వారి చరిత్ర.... క్రీస్తుశకం 1400లో కర్నాటక రాష్ట్రం మైసూర్‌లోని వ్యాసకుల బంధువుల గ్రామంలో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మొదటి అవతారమైన వ్యాసరాయతీర్థులు జన్మించారు. వ్యాసరాయతీర్థులు ఆంజనేయస్వామికి పరమ భక్తుడు. చిన్ననాటి నుంచే స్వామిని నిత్యం స్మరిస్తూ ఉప దీక్షలు చేశారు. ఒకసారి ఆయన తపస్సుకు మెచ్చి ఆంజనేయస్వామి ప్రత్యక్షమైనట్లు చరిత్ర చెబుతుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో దేశ సంచారంలో భాగంగా క్రీస్తుశకం 1412 లో వ్యాస రాయతీర్థులు ఆదోని, కర్నాటక తదితర ప్రాంతాల్లో పర్యటించారు. మొదటి సారి హంపీలో యాంత్రోద్వారక ఆంజనేయస్వామిని ప్రతిష్టించారు. 

 

 అప్పటి కాలంలో రాజులు యుద్ధానికి వెళ్లే ముందు 41 రోజులపాటు ఆంజనేయస్వామి దీక్షచేసి యుద్ధానికి వెళ్లి తిరిగివచ్చేవారు. అప్పటి నుంచి రణమండల ఆంజనేయస్వామిగా భక్తులు కొలుస్తున్నారు. వ్యాసరాయ తీర్థులు కొండకు పై భాగంలో నవతీర్థ ఆంజనేయస్వామి, సంతాన ఆంజనేయస్వామి, క్రింది భాగంలో చెరువు కట్ట ఆంజనేయస్వామి, తులసీ ఆంజనేయస్వామి, మంగరాయ ఆంజనేయస్వామి, వెంగళాపురం ఆంజనేయస్వామి, తారాపురం ఆంజనేయస్వామి, కోతూరు ఆంజనేయస్వామి, బసలదొడ్డి ఆంజనేయస్వామి ఇలా 101 విగ్రహాలను ప్రతిష్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఆదోని నుంచి వెళుతూ గుంతకల్లులోని కాసాపురం ఆంజనేయస్వామి, నేమకల్లు ఆంజనేయస్వామి, మురళీ ఆంజనేయస్వామి మూడు విగ్రహాలను ఒకే రోజు ప్రతిష్టించారు.

 

దారి పొడువునా ఆలయాలు...రణమండల ఆంజనేయస్వామి క్షేత్రానికి వెళ్లే క్రింద నుంచి కొండపై వరకు దారి పొడువునా ఆలయాలు వెలశాయి. కొండ దిగువ భాగంలో రాంజల రోడ్డులో పొట్ట గణపతి, కోట వెంకటరమణ స్వామి, కోట వీరభద్రస్వామి, మంగరాయ ఆంజనేయస్వామి, చెరువుకట్ట ఆంజనేయస్వామి, భూగర్భ గణపతి, కొండపై భాగంలో శివమారుతి, పరమ శివుడి మండపం, పక్కనే వీరభ్రహ్మేంద్రస్వామి గుహ, సంతాన ఆంజనేయస్వాములు వెలశాయి.

 

రణమండల కొండలో వెలసిన ఆంజనేయస్వామి ఆలయం పట్టణ ప్రజలు, దాతలు సహకారంతో అభివృద్ధి చెందుతోందని ఆలయ కమిటీ ఛైర్మన్‌ టిజి పాండురంగయ్యశెట్టి తెలిపారు. ప్రతి ఏడాది శ్రావణ, కార్తీక మాసాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొండల్లో షెడ్లు ఏర్పాటు చేశామని, దాతల సహకారంలో వెండి కవచాన్ని కూడా ఏర్పాటు చేశామని వారు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: