పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందన్న వ్యాఖ్యలు కుట్రపూరితమని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. కొందరు రాజకీయ అవసరాల కోసం తిరుమలను వాడుకుంటున్నారని ఆరోపించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఈ వివాదంపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.

 

తిరుమల తిరుపతి దేవస్థానం రూపొందించిన కేలండర్‌లో అన్యమతగుర్తులు కనిపించాలన్న వార్తలు... స్వామివారి భక్తుల్లో ఆందోళన రేపాయి. దీనిపై నెట్‌లోనూ విస్తృతంగా ట్రోలింగ్‌ జరిగింది. దీనిపై పలు ఫిర్యాదులు  అందడంతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం.. ఈ వ్యాఖ్యల్ని వ్యతిరేకించింది. కొందరు రాజకీయ అవసరాల కోసం తిరుమలను వాడుకుంటున్నారని.. టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. టీటీడీలో అన్యమత ప్రచారం  జరుగుతోందని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించాలని చూస్తున్నారన్నారు.

 

అన్యమత ప్రచారం చేయాల్సిన అవసరం తిరుమల తిరుపతి దేవస్థానానికి లేదన్నారు టీటీడీ ఛైర్మన్ వైవిసుబ్బారెడ్డి. టీటీడీని భ్రష్టుపట్టించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. నకిలీ వెబ్‌సైట్లతో దేవస్థానానికి సంబంధం లేదన్నారు. మతకల్లోలాలు  సృష్టించేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఘటనపై గూగుల్‌ కంపెనీ వివరణ కోరామని.. వివాదానికి కారణమైన వారిపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు.  తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా సైబర్ క్రైమ్‌ వ్యవస్థ ఏర్పాటు  చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కోరతామన్నారు. ఇది గూగుల్‌ సెర్చ్‌లోమాత్రమే కనిపిస్తోందని.. టీటీడీ వెబ్‌సైట్‌లోలేదని టీటీడీ ఈవో సింఘాల్ తెలిపారు.


పదిరోజుల వైకుంఠ దర్శనం గురించి తాము ఎలాంటి ప్రకటన చేయలేదని సుబ్బారెడ్డి తెలిపారు. మీడియాలో కథనాలు వస్తున్నాయన్నారు. అర్జిత సేవలు, నిత్య అభిషేకాల్లో మార్పులపైనా ఎలాంటి నిర్ణయం  తీసుకోలేదన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: