అయ్యప్పస్వామి భక్తులు కొన్ని కోట్లమంది ఉన్నారు. అయ్యప్పస్వామి మీద వారికీ ఎంతో ప్రేమతో ఎన్నో త్యాగాలు చేస్తారు. కఠోర దీక్ష తీసుకుంటారు. ఆ భక్తుల గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఎందుకంటే.. స్వామి వారికోసం ఎన్నో నియమాలు పాటిస్తారు.. ఎన్నో దీక్షలు చేస్తారు స్వామి భక్తులు.. 

 

ఇంకా మాలా ధరించిన సమయంలో అయితే 41 రోజుల పాటు అత్యంత క‌ఠిన‌మైన పద్ధ‌తిలో దీక్ష చేసి శ‌బ‌రిమ‌ల వెళ్లి స్వామిని ద‌ర్శించుకుని మాల తీసేస్తారు. ఆలా చేసే సమయంలో చాలా మంది ఒక‌టి క‌న్నా ఎక్కువ సార్లు మాల‌ను ధ‌రిస్తుంటారు. అందుకు వారికి స్వామిపై ఉన్న న‌మ్మ‌క‌మే కార‌ణం.

 

అంతేకాదు అయ్యప్ప స్వామి కోరిన కోరికలు తీరుస్తాడు అని, అనుకున్న‌ది అనుకున్నట్టుగా నెర‌వేరుతుంద‌ని, అంతా శుభ‌మే క‌ల‌గాల‌ని కోరుకుంటూ చాలా మంది భ‌క్తులు మాల వేసుకుంటారు. అయితే మాల వేసుకున్న‌న్ని రోజులు వారు అత్యంత నిష్టతో ఎన్నో నియ‌మాల‌ను పాటిస్తారు. అయితే ఆ నియమాలు ఏంటి అనేది ఇప్పుడు చదివి తెలుసుకోండి. 

 

అయ్య‌ప్ప మాల ధరించే భ‌క్తులు 3 రోజుల ముందు నుంచే మ‌ద్యం, మాంసం మానేసి త‌ల వెంట్రుక‌లు, గోర్ల‌ను ముందుగానే క‌త్తిరించుకుంటారు. అలానే మాల ధ‌రించే రోజు చెప్పులు లేకుండా శుభ్ర‌మైన దుస్తుల‌ను ధ‌రించి న‌ల్ల‌ని లుంగీ, కండువా, చొక్కా, తుల‌సిమాల తీసుకుని అయ్య‌ప్ప స్వామి ఆల‌యానికి వెళ్లాలి.

 

అక్కడ ఆరు సార్లు మాల వేసుకున్న గురు స్వామి భ‌క్తుల‌కు మాల ధార‌ణ చేస్తారు. మాల ధ‌రించే ముందు బ్ర‌హ్మ‌దేవుని చంద‌నంగా, శివుడిని విబూధిగా, విష్ణువును కుంకుమ‌గా భావించి నుదుటిపై పెట్టుకుంటారు. 


 
అయ్య‌ప్ప మాల ధ‌రించిన భ‌క్తులు దీక్ష‌ను పూర్తి చేసుకోవ‌డానికి విడిది ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో స్థ‌లం ఉంటే పీఠం ఏర్పాటు చేసుకోవ‌చ్చు. అది వీలుకాక‌పోతే ఇత‌ర స్వాముల‌తో క‌లిసి స‌న్నిధానం ఏర్పాటు చేసుకోవాలి. 

 

దీక్ష కోసం సంక‌ల్పం తీసుకుని క‌ల‌శ‌స్థాప‌న చెయ్యాలి. అయితే ఒక్క‌సారి గ‌న‌క క‌ల‌శ స్థాపన చేస్తే దీక్ష ముగిసేవ‌ర‌కు దాన్ని క‌దిలించ‌కూడ‌దు. అదేవిధంగా దేవతల చిత్ర‌ప‌టాల‌కు శిర‌స్సు నుంచి పాదాల వ‌ర‌కు అలంక‌ర‌ణ చేయాలి. దీపారాధ‌న చేశాక గ‌ణ‌ప‌తి, అమ్మ‌వారు, సుబ్ర‌హ్మ‌ణ్య స్వామిని పూజించాలి. అనంత‌రం అయ్య‌ప్ప‌ను పూజించాలి.

 

మొద‌టిసారి మాల ధ‌రించిన వారిని క‌న్నెస్వామి అని, రెండోసారికి కత్తి స్వామి అని, మూడో సారికి గంట స్వామి అని, నాలుగోసారి గ‌ద స్వామి, ఐదో సారి పెరు స్వామి, ఆరోసారి గురు స్వామి అని పిలుస్తారు.  

 

మాల ధ‌రించిన స్వాములు బ్ర‌హ్మ ముహుర్తంలో నిద్ర లేవాలి. చన్నీళ్లతో స్నానం ఆచ‌రించాలి. సూర్యోద‌యం కాక‌ముందే పూజ చేయాలి. తిరిగి సాయంత్రం చ‌న్నీటి స్నానం చేసి సంధ్యా పూజ పూర్తి చేయాలి.

 

భిక్షాట‌న చేసిన బియ్యంతోనే స్వ‌యంగా వండుకోవాలి. అలా సాధ్యం కాని స్థితిలో 41 రోజుల మండ‌ల దీక్ష పూర్త‌య్యాక ఇరుముడి క‌ట్టుకోవడానికి ముందు ఐదు ఇళ్ల‌లో భిక్షాట‌న చేయాలి.


 
మ‌ధ్యాహ్నం 3 గంట‌లలోపు భిక్ష చేయాలి. సాయంత్రం పూజ అనంత‌రం కొద్ది మొత్తంలో అల్పాహారాన్ని స్వీక‌రించ‌వ‌చ్చు.

 

క‌టిక నేలపై నిద్రించాలి. ఉల్లి, వెల్లుల్లి లేకుండా సాత్విక ఆహారం తీసుకోవాలి.

 

మ‌ల విస‌ర్జ‌న‌కు వెళ్తే తిరిగి స్నానం ఆచ‌రించి స్వామి వారి శ‌ర‌ణుఘోష చెప్పి హార‌తి తీసుకోవాలి.

 

ఒక‌సారి వేసుకున్నాక మాల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తీయ‌రాదు. నిత్యం ఏదైనా ఒక దేవాల‌యాన్ని సందర్శించాలి. స్వామియే శ‌ర‌ణం అయ్య‌ప్ప అనే మంత్రాన్ని ప‌ఠిస్తూ ఉండాలి.

 

మాల ధరించిన సమయంలో క‌నీసం ఒక్క‌సారైనా అయిదుగురు అయ్య‌ప్ప‌ల‌కు భిక్ష పెట్టాలి.

 

హింస‌, దుర్భాష‌లాడ‌డం, అబ‌ద్దాలు చెప్ప‌డం వంటి వాటికి దూరంగా ఉండాలి.

 

దీక్ష చేప‌ట్టిన వారిలో చిన్నా పెద్దా అని చూడకుండా ఏ అయ్య‌ప్ప స్వామికైనా పాదాభివంద‌నం చేయాలి. 

 

ముఖ్యంగా బ్ర‌హ్మ‌చ‌ర్యం పాటించాలి. నుదుటిపై విబూధి, కుంకుమ‌, చంద‌నం క‌చ్చితంగా ధ‌రించాలి.

 

అయ్యప్ప స్వామి దగ్గరకు వెళ్లాలంటే 18 మెట్లు ఎక్కాలి. అయితే ఆ మెట్ల‌లో ఎంతో మ‌హాత్మ్యం ఉంటుంది. కామం, క్రోధం, లోభం, మ‌దం, మాత్స‌ర్యం, మోహం, ద‌ర్పం, అహంకారం, వీక్ష‌ణా శ‌క్తి, వినికిడి శ‌క్తి, అగ్రాణ శ‌క్తి, రుచి చూసే శ‌క్తి, స్ప‌ర్శ శ‌క్తి, స‌త్వ గుణాలు, త‌మో గుణం, ర‌జో గుణం, విద్య‌, అవిద్య ఇలా అష్టాద‌శ శ‌క్తులు అయ్య‌ప్ప ఆల‌యం ముందు మెట్ల‌పై నిక్షిప్తమై ఉంటాయ‌ట‌. ఆ మెట్ల‌లో 18 ర‌కాల శ‌క్తులు ఉండ‌డం వ‌ల్ల 18 సార్లు యాత్ర చేస్తే ఎంతో మంచిద‌ని పురాణాలు చెబుతున్నాయి.

 

దీక్ష‌ధార‌ణ‌లో ఉన్న‌వారు శ‌బ‌రిమ‌ల యాత్ర అనంత‌రం ఇంటికి వ‌చ్చాకే మాల‌ను తీసేయాల‌ట‌. ఇంటి ద‌గ్గ‌ర మాతృమూర్తితో మూల తీయించి అందులో మాల‌ను మ‌రుస‌టి ఏడాది కోసం భ‌ద్ర ప‌ర‌చాలి.

 

చూశారుగా... అయ్యప్ప స్వామి భక్తులు ఎన్ని నియమాలూ పాటిస్తారు అనేది. వారు ఆరాధించే దేవుడి కోసం 41 రోజులు ఎంతో నిష్ఠతో నియమాలను పాటిస్తారు. ఎంతటి చలి కాలం అయినా సరే వారు చన్నీటితోనే స్నానం ఆచరిస్తారు.. అల్పాహారమే సేవిస్తారు. వారికంటే వయసులో చిన్నవాడైన సరే స్వామి అనే పిలుస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: