కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి తిరుమల అంటే శ్రీవారే.. ఆణువణువూ శ్రీవారే ఉంటారు. అయితే ఈ తిరుమలలో శివాలయం గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం...

 

తిరుపతిలో వెలసిన పవిత్ర తీర్థరాజమే కపిలతీర్థం. ప్రపంచ ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ శ్రీవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి, కోదండరామస్వామివారి ఆలయాలు కూడా ఉన్నాయి. గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శివాలయం  కూడా ఉంది. అదే కపిలతీర్థం. 

 

తిరుపతికి ఉత్తరంలో, తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి వైపు వెళ్తే ఈ అద్భుతమైన శివాలయం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఇక్కడకు వస్తే... ప్రకృతి సుందర జలపాత దృశ్యాలలో చూపు తిప్పనివ్వకుండా అక్కడి ప్రశాంత వాతావరణం అక్కడే ఉండేలా చేస్తుంది. అంత అందంగా అద్భుతంగా తిరుమల శివారులో ఆ ఆలయం ఉంటుంది. 

 

అయితే ఈ ఆలయం ఇక్కడ ఇక్కడ ఎలా ఏర్పడిందంటే... కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం చెప్తుంది. కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైంది ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది. 

 

అయితే ఇక్కడి లింగాన్ని కూడా కపిల లింగం అంటారు. ఆ తరవాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడట. అందువల్ల, ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమనికూడా పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు.

 

కాగా ఈ కపిలతీర్థంకు చేరుకోవాలంటే తిరుపతి బస్టాండు సమీపంలోని రైల్వేస్టేషన్‌ నుంచి ప్రతీ అరగంటకూ ఒక ఉచిత టీటీడీ బస్సు వస్తుంది. ఆ బస్సు ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. ఒక బస్సులే కాదు ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం ఎంతో మనోహరమైన ఈ ఆలయాన్ని వెళ్లి ఒకసారి సందర్శించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: