శబరిమలలో స్వామివారికి అభిషేకం కావింపబడిన ఇరుముడిలోని “ముద్రకాయ” లో వున్న నేతిని మనకు ప్రసాదముగా, గురుస్వామి పంచి ఇస్తాడు. అ నేతిని మనమేమి చేయాలి? అనేది మీ ప్రశ్న అయితే, ఇందుకు సమాధానం తెలుసుకోవాలంటే, ముందు ముద్రకాయ విశిష్టత తెలుసుకోవాలి.

 


ఇరుముడి కట్టుకొన్నప్పుడు తొలుత గురుస్వామి మనచే, ముద్రకాయను నేతితో మనచే నింపిస్తారు.  కొబ్బరికాయ అనగా దానిని మన కాయముగా (స్థూల శరీరముగా) భావించ వలేను, కొబ్బరికాయ పిలక మన అహంకారము. పీచు మానవునికి గల ఇహలోక బంధాలు. పిలకను తీయడం మన అహంకారమును త్రుంచి వేయుటయే. ఈ లోకమునకు గల బంధాలనన్నింటిని త్యజించుటయే, పీచును పూర్తిగా తీసి వేయుట, అంటే మన బంధాలన్నింటిని మననుండి వేరు చేస్తున్నామన్న మాట. బందాలను పూర్తిగా తొలగించాలంటే, “భక్తి”  అనే రాతిపై తిక్కి అరగదీస్తే, అవి మననుండి వేరు కాబడుతాయి. అలా చేసిన కొబ్బరికాయకు మూడు కన్నులు (రంద్రాలు) కనిపిస్తాయి. అందులో ఒక కన్ను జ్ఞాననేత్రము, ఆ నేత్రాన్ని తెరవాలి.

 

అందుకు దానికి రంద్రము చేస్తాము. మనం “సంకల్పం" అనే పనిముట్టుచే రంద్రము చేసి, మోహమనే కొబ్బరి నీటిని అందులోనుంచి తొలగించి, “ప్రణవము” అనే అగ్నికి చూపించాలి అప్పుడు “మోహం” పూర్తిగా తొలగిపోతుంది. అందులో మనం “ జ్ఞానం” అనే  నేతిని నింపాలి. అటుపిమ్మట మన "నేర్పు” అనే బిరడాతో మూయలి. ఆపై “ఆశయం” ఆనే లక్కను వుంచి, "ఆయనే నీవు” అనే అప్పడం పెట్టాలి. అదియే “సోహం” అనగా స + హమ్ = ‘అతడే నీవు’, ‘నీవే అతడు’  అని అర్థముగా భావించవలేను. ఆ అప్పడంపైన “అభ్యర్దము” అనే విభూతిని చల్లాలి. అప్పుడు ఆ ముద్రకాయను “వైరాగ్యం” అనే సంచిలో పెడతాడు గురుస్వామి. బంధాలన్నీ తెంచుకొనిన ఆ భక్తుడికి “వీడ్కోలు” పలుకునట్లు, తల్లి, తండ్రి, భార్య పిల్లలు, ఆ భక్తుడితో మానసిక, శారీరిక సంభందీకులు, ఆ భక్తుడి గుణాన్ని పొగుడుతున్నట్లు బియ్యంవేసి, వారి బంధాలను తెంపుకుంటారు.

 

చివరిగా గురుస్వామి తన శిష్య సంబధాన్ని కూడా తెంపుతూ మూడు సార్లు బియ్యం వేసి "ధ్యానమనే” తాడుతో బిగించుతారు. స్థూలంగా చెప్పాలంటే భక్తుడు విరాగిగా మారి, తన వారిచే విరాగిగా ఒప్పించి, తన యొక్క ప్రాణ, భవ బంధాలన్నీ ముద్రకాయ సంచిలో భద్ర పరచి, కేవలం ఊపిరి, రక్త మాంసాలు కల ఒక చలన జీవిగా తయారైతాడు. ఇదే అసలైన అర్దం. అందుకే ఆ ఇరుముడి అనుక్షణం మన వద్దనే వుంచుకోవాలి. మననుండి వేరు చేయకూడదు. వేరు చేయలేము. అప్పటినుండి, భక్తుడే ముద్రకాయ, ముద్రకాయే భక్తుడు. ఇరుముడి శిరస్సున ధరించి ఎవరికి పాదనమస్కారం చేయరాదు. ఇరుముడి శిరస్సున ఉంచుకొని యాత్రలో ఎక్కడకూడ ఏది తాగరాదు, తినరాదు.

 


శబరిమలలో ఆ నేతిని అభిషేకానికి అర్పించగా మిగిలిపోయిన భక్తుడి శరీరం అనబడే ఆ యేమిలేని ఆ కాయను (కాయమును) అగ్నిగుండమునకు ఆహుతి చేస్తాము. అభిషేకము అనగా మన ప్రాణ, భవబంధాలన్నీ ఆ స్వామికి అర్పించగా, ఆయన సంతోషముతో స్వీకరించి, పావనము చేసి తిరిగి మనకు వెనక్కు ఇస్తాడు. అదియే గురుస్వామి మనకు ఇచ్చే "నెయ్యి", పిడికెడు బియ్యము.  


ఆ విధముగా స్వీకరించిన బియ్యముతో పొంగలి చేసి, ఆ నేతిని అందులో కలిపి అందరికి పెట్టాలి. అది స్వామి మనకుకకు తిరిగి ఇచ్చిన స్వచ్చమైన, పాపరహిత పరమ పుణ్య జీవముగా భావించాలి. మన జీవాన్ని మనం పుచ్చుకొనువరకు, మనం కేవలం ఒక శరీరం మాత్రమే. అది పుచ్చుకొన్న పిదపనే మనము ప్రాణమున్న ఆకళింకిత పాప రహిత  పవిత్ర జీవిగా తయారవుతాము. మనవారు ఆ ప్రసాదమును స్వీకరించి మనము, వారును,  మన పూర్వపు భవ బంధాలను, ఆత్మీయతలను  పునరిద్దరించుకుంటాము అని అర్ధం. ఇంతటి మహాత్వము కలది “అభిషేకం చేసిన నెయ్యి ”. 

 

అభిషేక నేతిని మనము సకలరోగ నివారణ ఔషదముగా కూడా వాడుకొనవచ్చును. ఆ స్వామి దివ్య మంగళ స్వరూపము పైనుండి తిరిగి మనకు లభించిన పరమ పావన మహా దివ్య ప్రసాదం "ఆ పవిత్ర నెయ్యి".నెయ్యాభిషేక ప్రియనే శరణం

మరింత సమాచారం తెలుసుకోండి: