వడ్ల గింజల్ని గోటితో వలువగలమా ? అంతటి ఓపిక ఎవరికుంటుందీ అంటారా? రామ భక్తులుగా పేరుగాంచిన వానర సైన్యానికి తప్ప ఇంకెవరికి ఉంటుంది? ఇంతకీ ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం..!

 

ఈ దృశ్యం చూస్తుంటే.. రామభక్తులైన  వానర సైన్యం  నిజంగానే భూమికి దిగొచ్చిందా అన్నట్టుగా ఉంది కదూ. అయితే ఇదేదో సినిమా షూటింగో, మరేదో సాంస్కతిక కార్యక్రమమో అనుకుంటే మీరు పొరబడినట్టే. ఎందుకంటే వీరు నిజంగా రామభక్తులు.. ఆ రాముడి కోసం చేసిన కార్యక్రమం. వరి కోతలు మొదలు పెట్టిన ఈ రామభక్తులు.. ఒడ్లను గోటితో వలిచి సీతారాముల కళ్యాణానికి  కోటి తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. భద్రాచలం, ఒంటిమిట్ట రామాలయాలకు అందించనున్న కోటి తలంబ్రాలను సిద్ధం చేసేందుకు ఇలా వానరుల వేషధారణతో సందడి చేశారు. రామభక్తులు ఆద్యంతం శ్రీరామ నామ స్మరణలో మునిగితేలారు. 

 

తూర్పుగోదావరి జిల్లా  కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ప్రతీ ఏటా  భద్రాచలం, ఒంటిమిట్ట రామాలయాల్లో జరిగే సీతారామ కల్యాణాలకు కోటి తలంబ్రాలను అందించేందుకు స్వయంగా రామ పంట పండిస్తున్నారు.  కోరుకొండ మండలం అచ్చుతాపురంలోని ఎకరం పొలంలో వరి సాగు చేసి ధాన్యం తయారు చేస్తున్నారు. ఈ రకంగా పండించిన చేసిన ధాన్యాన్ని రామభక్తులు 4నెలల పాటు శ్రమించి, గోటితో వలిచి 800 కేజీల బియ్యంతో కోటితలంబ్రాలు సిద్ధం చేస్తారు. 

 

9 ఏళ్ల నుంచి భద్రాచలం  సీతారామ స్వామి కళ్యాణానికి , 4ఏళ్లుగా ఒంటిమిట్ట రామాలయానికి కోటితలంబ్రాలు అందిస్తున్నారు. శ్రీరామ నామం అనే విత్తనాన్ని మనస్సులో  నాటుకుంటే జ్ఞానం అనే పంట పండుతుందనేది వీరి విశ్వాసం. లోకకళ్యాణం కోసం  శ్రీరామ తత్వాన్ని దశదిశలా  వ్యాపింపజేయాలనే  సంకల్పంతో  కోటితలంబ్రాలు కార్యక్రమం చేపడుతున్నట్లు  నిర్వాహకులు తెలిపారు. 

 

ఈ భక్తిపూర్వక కార్యక్రమంలో 60 గ్రామాలకు రామభక్తులు శ్రీరామ నామాన్ని జపిస్తూ.. గోటితో వడ్లను ఒలిచే కార్యక్రమం చేపడుతున్నారు. ఇందులో భాగంగానే రామభక్తులు వానరుల వేషధారణతో తరలివచ్చారు. ఈ సందర్భంగా సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: