కాణిపాకం.. నిజానికి నిలువుగా.. అబద్దానికి సింహ స్వప్నంగా ఉన్న ఈ కాణిపాకం ఎలా వెలసిందో తెలుసా ? అసలు ఈ ఆలయంలో వినాయకుడికి అప్పట్లో రక్తం వచ్చింది ఎందుకో తెలుసా ? అవి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇక్కడ చదవండి. చిత్తూరులో కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. నిత్యం ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నాడు. 

 

ఈ స్వామికి ఒక్క హిందువులే కాదు ఇతర మతస్థులూ కూడా మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు వస్తుంటారు. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఈ కాణిపాకంలో కనిపిస్తుంది. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ కాణిపాకం ఆలయం ఎలా వెలసింది అంటే.. 

 

దాదాపు వెయ్యి ఏళ్ల కిత్రం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. విహారపురి అనే గ్రామంలో ముగ్గురు వ్యక్తులు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. అయితే ఆలా జన్మించిన వారు కర్మఫలాన్ని అనుభవిస్తూ.. ఉన్న పొలాన్ని సాగు చేసుకొంటూ జీవించేవారు. ఏమైందో తెలియదు కానీ ఒక దశలో ఆ గ్రామం కరవు కాటకాలతో అల్లాడింది. గ్రామస్థులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. 

 

దీంతో కరవును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే బావిలో తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. రక్తం అంగవైకల్య సోదరులను తాకగానే వాళ్ల వైకల్యం వెంటనే తొలిగిపోయింది. 

 

దీంతో జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో ఓ బాండ రాయి 'వినాయకుడు' రూపంలో కన్పించింది. దీంతో గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో ఆ వినాయకుడు రూపాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి గ్రామస్థులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ఎకరం పొలం మేర పారింది. అప్పట్నుంచి విహారపురి గ్రామం కాస్త 'కాణిపారకరమ్‌' అన్న పేరు వచ్చింది. అయితే కాలక్రమంలో అదే 'కాణిపాకం'గా మారింది. ఇలా మనం నిత్యం ఆరాధించే కాణిపాకం వెలసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: