ప్రజలు ముఖ్యంగా ముప్పై మూడు కోట్ల మంది కొలిచే దేవుళ్లలో పార్వతీ పరమేశ్వరుల రెండవ కుమారుడైన కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వర స్వామి) ఒకరు. ముఖ్యంగా తమిళనాడు, రాష్ట్రంలో అనేక ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు అక్కడ ఉన్నాయి. ప్రతి ఏటా స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్యేశ్వర షష్టిని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు అక్కడి ప్రజలు. రాక్షసుడైన తారకాసురున్ని వధించేందుకు జన్మించిన కుమారస్వామిని విజయాన్ని ప్రసాదించే దైవంగా భక్తులు ఆయన్ని కొలుస్తారు. ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఆయనను పూజించడం, తలచుకోవడం చేస్తుంటారు. భక్తులు ఎక్కువగా సందర్శించే ప్రముఖ ఆలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

మొదటగా చెప్పుకోవాల్సినది శివ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం. ఈ ఆలయం మురుగనలాంగ్ (సుబ్రహ్మణ్యేశ్వర స్వామి) ఆయన భార్యలు వల్లినాయకి, దైవనాయకి లకు అంకితం చేయడం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వరుడు యుద్ధంలో దైవనాయకిని, ప్రేమలో వల్లినాయకిని గెలిచినప్పుడు ఈ ఆలయాన్ని స్థాపించినట్లు అక్కడి ప్రజలు చెబుతారు. ఇక్కడి గోడలపై కుడ్య చిత్రాలు, అలంగకరణలు ఆశ్చర్యకితులను చేస్తాయి. ఈ ఆలయం చెన్నై నుంచి కేవలం 10 కిలోమీటర్లు దూరంలోనే ఉంది. 

 

రెండో ఆలయం గురుంచి అయితే కుమురన్ కుంద్రన్ ఆలయం. 40 ఏళ్ల నాటి మురుగన్ ఆలయం ఇది. ఇక్కడ ప్రతి అంతస్తులోనూ ఎన్నో దేవతా విగ్రహాలు కనిపిస్తాయి. సుందరమైన అలంకరణలతో, వైభవం ఉట్టిపడే నిర్మాణంతో ఒక కొండపై ఈ ఆలయం ఉంటుంది. కంచి మఠానికి చెందిన సాధువు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ మురుగన్ ఆలయం నిర్మించాలని కోరారంట. సాధువు వెళ్లిపోయిన తర్వాత ఈ ఆలయం నిర్మాణం అంత త్వరగా జరగలేదు. అయితే 20 ఏళ్ల తరువాత ఈ కొండపై మురుగన్ యొక్క ఆయుధం కనిపించడంతో ఆలయ నిర్మాణం జోరందుకొని శరవేగంగా పూర్తయ్యింది. ఈ ఆలయం చెన్నై నుంచి 26 కిలోమీటర్లు దూరంలో ఉంది.

 

ఇంకా తర్వాత చెప్పుకోదగ్గ సుబ్రమణ్య స్వామి ఆలయం తిరుపొరుర్కందస్వామి ఆలయం. పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాక్షసులతో తిరుచెందూర్ వద్ద ఆకాశంలో, తిరుప్పారన్ కుందారం వద్ద భూమిపై, తిరుపొరూర్ వద్ద గాలిలో యుద్ధం చేసినట్లు ఇక్కడి చరిత చెబుతుంది. అగస్త్య మహాముని పొతిగై పర్వతాల గుండా ప్రయాణిస్తుండగా ఈ ప్రదేశాన్ని గుర్తించినట్లు ఇక్కడి కధనం. తరుక అనే అసురునిపై సుబ్రహ్మణ్యేశ్వరుడు విజయం సాధించిన తర్వాత ఈ ప్రాంతం పొరుర్ (తమిళంలో యుద్ధం), తరుకపురి, సమరపురిగా పిలవబడుతుంది. గాలి, భూమి, ఆకాశంలో మూడు చోట్ల సుబ్రహ్మణ్యేశ్వరుడు యుద్ధం చేయడం వలన దీనికి తిరుపొరుర్కందస్వామి ఆలయంగా పేరు వచ్చినట్లు అక్కడి వారి నమ్మకం. ఇక ఈ ఆలయం చెన్నై నుంచి 40 కిలోమీటర్లు దూరంలో ఉంది.

 


ఇక ముఖ్యమైన క్షేత్రంగా చెప్పుకొనే పళని మురుగన్ ఆలయం. శివ పార్వతుల తనయుడైన కుమారస్వామిని మురుగన్, కార్తికేయ అని కూడా పిలుస్తారు. పురాణ కధనం ప్రకారం విఘ్నాదిపత్యం కోసం సోదరులైన వినాయకుడు, కుమార స్వామి మధ్య ఓ పోటీ పడుతుంది. ఎవరైతే ప్రపంచంలో అన్ని పుణ్యనదుల్లో స్నానం ఆచరించి ముందుగా కైలాసం చేరుకుంటారో వారికే విఘ్నాదిపత్యం దక్కుతుందని చెప్పడంతో దీనితో కుమార స్వామి తన నెమలి వాహనంపై శరవేగంగా పుణ్యనదులకు చేరుకోగా అక్కడ ముందుగానే వినాయకుడు ప్రత్యక్ష్యమయ్యేవాడు. తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేయడం వలన ప్రపంచంలోని అన్ని పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన ఫలం వినాయకుడికి దక్కి ఆయన విజేతగా అవుతాడు. దీనితో ఆగ్రహించిన కుమారస్వామి పళని వద్దే ధ్యానం ఆచరించి పరిపక్వత చెందినట్లు అక్కడి పురాణ కధనం. ఆ ఆలయం మధురై నుంచి 100 కిలోమీటర్లు
 దూరంలో ఉంది. 

 

ఇక చివరిగా చెప్పుకోదగ్గ ఆలయం స్వామినాధస్వామి ఆలయం. కావేరీ నది పరివాహిక ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం సుబ్రహ్మణ్యేశ్వరుడి 6 పవిత్ర ఆలయాలుగా పిలువబడే అరుపడైవీడులో ఇది ఒకటి. కొండపై 60 అడుగుల ఎత్తు ఉండే ఆలయంలో స్వామినాధస్వామి విగ్రహం, కొండ కింద తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్వరుల మందిరాలు ఇక్కడ కనపడుతాయి. మూడు గోపురాలతో నిర్మితమైన ఈ ఆలయంలోని విగ్రహాలు గ్రానైట్ తో చేశారు. ప్రణవ మంత్రంతో తండ్రి పరమేశ్వరున్ని సుబ్రహ్మణేశ్వరుడు ఇక్కడే సంతృప్తి పరచడంతో ఈ ఆలయంలో స్వామి వారు స్వామినాథస్వామిగా పేరుగాంచారు. ఈ ఆలయం చెన్నై నుంచి 300 కిలోమీటర్లు దూరంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: