అయ్యప్ప.. హిందూ దేవతలలో ఒకరు. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. ఇక ప్రతి ఏటా వేలాది మంది భక్తులు మాల వేసుకుని అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల యాత్రకు వెళ్తుంటారు. ఇలా మాల వేసుకున్న‌ భక్తులు ముందు అక్క‌డ ఉండే భారీ మసీదులోకి వెళ్తారు. దీనిని వావర్ మసీదు అంటారు.

 

మసీదులో ప్రదక్షిణలు చేసి, విభూది, మిరియాల ప్రసాదం తీసుకుని శబరిమల యాత్రను కొనసాగిస్తారు. అయితే అస‌లు ఎందుకు అయ్య‌ప్ప ద‌ర్శ‌నానికి ముందు భ‌క్తులు మ‌సీదుకు వెళ్తారో తెలుసా.. వావర్ అంటే ఒక సూఫీ సన్యాసి. ఆయన అయ్యప్ప స్వామికి పరమ భక్తుడు. అయ్యప్పపై ఆయనకు ఉన్న భక్తి గురించి శతాబ్దాల నుంచీ చెప్పుకుంటున్నారు. అందుకే భక్తులు శబరిమల యాత్రలో వావర్ స్వామి ఉన్న మసీదును దర్శించడం ఒక సంప్రదాయంగా మారింది. వావర్ గురించి చాలా రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటికి చారిత్రక ఆధారాలు లభించడం లేదు. 

 

కొంతమంది ఆయన ఇస్లాం ప్రచారం కోసం అరేబియా సముద్రం నుంచి వచ్చిన సూఫీ సన్యాసిగా చెబుతారు. మ‌రి కొంద‌రు మాత్రం మసీదులో ఒక కత్తి ఉందని, దానిని బట్టి వావర్ ఒక వీరుడు అయ్యుంటారని చెబుతారు. కానీ వావర్ ఒక ముస్లిం, అయ్యప్ప భక్తుడు అనే విషయంలో మాత్రం ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. అయ్యప్ప మాల ధరించిన భక్తులు తమ తమ సంప్రదాయాలను అనుసరించి మసీదులో పూజలు చేస్తారు. అక్కడే నమాజు కూడా చేస్తారు. మసీదులో ప్రదక్షిణలు చేసే సంప్రదాయం గత 500 ఏళ్లకు పైగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: