ఆదివాసీల ఆరాధ్య దైవం జంగుబాయి జాతర ప్రారంభమైంది. ప్రకృతిని పూజించే ఆదివాసీలు కొండకోనల్లో కొలువైన జంగుబాయి జాతరకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. గుహలో కొలువైన ఆ  క్షేత్రానికి దేశ నలుమూలల నుంచి గిరిపుత్రులు కదిలివస్తున్నారు. ఇంతకీ జంగుబాయి జాతర ఏంటీ. ఎన్నిరోజుల పాటు ఈ జాతర జరుగుతుంతో ఆ విశేషాలు చూద్దాం.

 

కొమురం భీం అసీఫాబాద్ జిల్లాలోని కెరామెరి మండలంలోని ఎత్తైన కొండలు, చుట్టూ అడువులు ఏపుగా పెరిగిన చెట్లు.. అభయారణ్యం మధ్యలో ఉందో పుణ్యక్షేత్రం.. అదే జంగూబాయి వనక్షేత్రం.. లక్షలాది మంది అదివాసులు అరాధించి పూజించే జంగుబాయి దేవతా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతీ సంవత్సరం పుష్యం మాసం నుంచి ప్రారంభమై...నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. 

 

జంగూబాయి దేవత ఛత్తీస్‌ఘడ్ నుంచి వచ్చి ఇక్కడ గుహలో బస చేసిందని పురాణాలు చెబుతున్నాయి. పోచమ్మ ఆలయం వెనుక ఉన్న పెద్ద గుహలో జంగుబాయి దేవి కొలువై ఉంది. వందల సంవత్సరాల చరిత్ర కలగిన ఈ దైవ క్షేత్రానికి ఈ మధ్యకాలంలో ప్రాధాన్యత వచ్చింది. నియమ నిష్టలతో బాజా భజంత్రీలతో ఆదివాసులు ఇక్కడకి వచ్చి, పూజలు చేస్తారు. ఇక్కడ దీపం నిత్యం వెలుగుతూనే ఉంటుంది. పూర్తిగా గుహ కావడం వల్ల అందులోకి కూర్చునే నడుస్తారు. 

 

చిమ్మచీకటిలో దీపం వెలుగులో ఆ దేవత కనిపిస్తుంది. మనసులో ఉన్న కోరికలు తీర్చే తల్లిగా ఆదివాసులు భావిస్తారు. పుష్యమాసంలో నెలవంక కనిపించిన నాటి నుంచి ప్రారంభమై...అమవాస్య వరకు కొనసాగుతుంది. ఈ జాతరకు వచ్చే భక్తులు నియమ నిష్టలతో రావాల్సి ఉంటుంది. పాదరక్షలు లేకుండా కాలి బాటనే ప్రయాణం చేయాలి. నెలరోజుల పాటు నేలపైనే పడుకుంటారు ఆదివాసీలు.  

 

వివిధ రాష్ట్రాల్లో ఉన్న జంగుబాయి వారసులు వేలాదిగా ఒకే వేదికపై మొక్కులు చెల్లించుకుంటారు. పోచమ్మ తల్లికి మొక్కులు తీర్చుకుంటారు. జంగుబాయి గుహ ముందు భక్తులు నాణేలను అతికిస్తారు. మనసులో ఏదైనా కోరిక బలంగా కోరుకొని, నాణేన్ని అతికిస్తే, ఆ కోరిక తీరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

మరింత సమాచారం తెలుసుకోండి: