ప్రతి నెలా వచ్చే ఏకాదశుల్లో ఉపవాసం చేయలేని వారు కనీసం ఈ వైకుంఠ ఏకాదశి నాడైనా వ్రతం ఆచరించాలని శాస్త్రం పేర్కొంది. ఈ రోజున ప్రాతః కాలమందే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి ఇంట్లోని దేవునిగదిలో దీపారాధన చేసి విష్ణు భగవానున్ని ఆరాధించాలి. అవకాశం ఉంటే తామరవత్తులు, నెయ్యి లేదా కొబ్బరినూనెతో దీపారాధన చేయాలి. తులసి, బిల్వదళం, జాజిపూలు, సంపెంగలతో విష్ణు ఆరాధన చేయాలి. అనంతరం ఓం నమో నారాయణాయనమః లేదా మరేదైనా విష్ణునామాన్ని జపించడం లేదా కీర్తించడం చేయాలి. అదేవిధంగా వైకుంఠ ఏకాదశినాడు ఉపవాసం ఉండాలనుకొనే వారు ముందు రోజు రాత్రి అంటే దశమి రాత్రి కేవలం అల్పాహారం తీసుకోవాలి.


ఏకాదశినాడు పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉండాలి. అంటే ఏకాదశి మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి పూజాదికాలు పూర్తిచేసుకొని దేవునికి నైవేద్యాన్ని సమర్పించి, వెంటనే భోజనం చేయాలి. అవకాశం ఉంటే ఎవరినైనా భోజనానికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి అతిథితో కలిసి భోజనం చేస్తే విశేషమని పెద్దల అభిప్రాయం. అదేవిధంగా ద్వాదశి రాత్రి కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండటం. కేవలం ఆహారం తీసుకోకపోవడం మాత్రమే కాదు విష్ణునామ పారాయణం, భజనలు, కీర్తనలు ఇలా ఏదో ఒకరకంగా దేవుడికి దగ్గరగా ఉండటం. సమీపంలోని విష్ణుదేవాలయానికి వెళ్లి ఉత్తరద్వార దర్శనం చేసుకోవాలి. 


అవకాశం ఉంటే పేదలకు దానధర్మాలు చేయాలి. శరీరం సహకరించనివారు, లౌకిక అవసరాలతో ఉపవాసం చేయలేని వారు కనీసం ఆ రోజు అంతా భగవన్నామ స్మరణతో తమ దైనందిన కార్యక్రమాన్ని పూర్తిచేసుకోవచ్చని శాస్త్రాలు చెపుతున్నాయి. ఈ విధంగా చేయడం వల్ల 12 రకాల ప్రయోజనాలు ఉంటాయని శాస్త్రాలు వివరించాయి. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు అంటే మొత్తం పదకొండింటిని భగవంతునికి సమర్పించాలని, ఈ పదకొండింటిని బుద్ధితో ఒకటిగా చేయడమే శుద్ధత్వం. అదే ఏకాదశి వ్రతం.


శాస్త్రాలు.. వేదాలు పలు కఠినమైన నియమాలు చెప్పినప్పటికి యుగధర్మాలను బట్టి చాలా సడలింపులు ఇచ్చాయి. ముఖ్యంగా ఆరోగ్య కారణాల వల్ల నాలుగు పూటలా ఆహారం తీసుకోకుండా ఉండలేనివారు, పిల్లలు, వయోవృద్ధులు, ఉద్యోగావసరాలతో ఆయా నియమాలు పాటించని వారికి కొన్ని మినహాయింపులను శాస్త్రాలు ఇచ్చాయి. ఏకాదశి వ్రతం ఆచరించలేని వారు కీర్తనం – ప్రపదనం – ప్రసూనార్పణం చేయాలని పేర్కొన్నాయి. అంటే భగవన్నామ గానం, చేతులు జోడించి శరణాగతి, భగవంతుని పాదార్చన చేసుకొంటేచాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: