భోగి అంటే భోజనం భోగి అంటే దేవునికి భోగం భోగి అంటే కుటుంబాలన్నీ భోగభాగ్యాలతో తులతూగడం భోగి అంటే పాతకు శలవు పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించడం భోగి అంటే పిల్లలకి భోగంగా భోగిపళ్లు పోయడం భోగి అంటే అన్నిటినీ అంగరంగవైభవంగా ఆనందించడం భోగి అంటే సూర్యుణ్ని ఆరాధించే అతి పెద్ద ఉత్సవం. సంక్రాంతి పండగ వచ్చిందంటే తెలుగు లోగిళ్లన్నీ కళకళ లాడుతుంటాయి. కొత్త పంటలు ఇంటికి రావడం, అల్లుళ్లు, కూతుళ్లు, మనుమలు... ఇంటి నిండా ఆత్మీయులు, సన్నిహితులు... అబ్బో... ఆ వేడుక చూడడానికి ఇంద్రుడికున్న వెయ్యి కళ్లు అద్దెకు తెచ్చుకున్నా కూడా చాలవేమో. పిల్లల ఆటపాటలు, బావలను ఆటపట్టించే మరదళ్లు, మామగారిని కోరికలు కోరే కొత్త అల్లుళ్లు, అందరికీ రకరకాల పిండివంటలు తయారుచేసే అమ్మమ్మలు, మేనత్తలు... ఇవన్నీ పండగ సంబరాలను ఆస్వాదించేలా చేస్తాయి. ఏ ఇంట చూసినా అరిసెల పాకం వాసన నాసికాపుటాలను సోకుతుంది. లోగిళ్లన్నీ ఉమ్మడి కుటుంబాలతో కళకళలాడతాయి. భోగి అంటేనే భోగమయిన పండగేమో అనిపిస్తుంది. ఈ పండగంత సంపన్నమైన పండగ మరొకటి లేదని నిరూపిస్తుంది.

 

వీధి వీధికి భోగి మంట‌లు వేస్తారు. ఆ మంట‌ల పైనే ప‌ల్లెటూర్ల‌ల్లో వేడి నీళ్ళు కాచుకుంటారు. ఆ నీళ్ళ‌తో కుటుంబంలో అంద‌రూ అభ్యంగ‌న స్నానాలు ఆచ‌రిస్తారు. భోగి పండుగ నాడు బ‌లిచ‌క్ర‌వ‌ర్తి సూక్ష్మ‌రూపం ధ‌రించి భూమిపైకి వ‌స్తాడ‌ని ఓ విశ్వాసం. ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేస్తాం కదా, అలాగే ఒంట్లోని పనికిమాలిన ఫీలింగ్స్‌ అన్నిటినీ మంటల్లో వేయమంటారు? ఎలా సాధ్యం? ఎండు పుల్లల్ని, పాత చీపుళ్లను, పిడకల్ని, చెక్క ముక్కల్ని వేసినట్లు మనసు లోపలి భావాలను అగ్నికి ఎలా ఆహుతి చెయ్యాలి అని పూర్వికులు చెబుతుంటారు. అగ్నిని రాజేసుకుని.. మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలను అందులో  కాల్చి బూడిద చేసుకోవాలి. అప్పుడు క్లీన్‌ అయిపోతాం. న్యూ లుక్‌ వచ్చేస్తుంది. కొత్త సంక్రాంతి లుక్‌. పండక్కి అల్లుడొచ్చాక ఇంటికి వస్తుంది కదా ఆ లుక్‌. రైతులు పాడి పశువులకు స్నానం చేయించి, ఎండకు మిలమిల్లాడిస్తారు కదా ఆ లుక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: