తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే పెద్ద పండుగలలో సంక్రాంతి పండుగ కూడా ఒకటి. సంక్రాంతి పండగ కోసం సంవత్సరం మొత్తం ఎదురుచూస్తూ ఉంటారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఘుమఘుమలాడే పిండి వంటలు, కోడి పందేలు, గంగిరెద్దులు, రంగవల్లులు ఇలా చాలా ఉంటాయి. సంస్ర్కృతీ సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం సంక్రాంతి పండుగ. తెలంగాణ రాష్ట్రంలో గాలిపటం పందేలు సంక్రాంతి పండుగ ఉత్సాహాన్ని పిల్లల్లో నింపుతాయి.
 
బాలలు, యువకులు రంగురంగుల గాలిపటాలను ఎగరేస్తూ ఆకాశాన్ని శోభాయమానం చేస్తుంటే పెద్దలు కూడా వయస్సు మరిచి ఆనందంగా వారితో కలిసిపోతారు. సంక్రాంతి పండుగ వేళ చిన్నాపెద్దా తేడా లేకుండా గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందంగా గడుపుతారు. నింగిలో రంగురంగుల గాలిపటాలు కనువిందు చేస్తుంటే అందరి దృష్టి అటువైపే మరలుతుంది. రాష్ట్రంలో ఇంటి ముంగిట ముత్యాల ముగ్గులు, గంగిరెద్దుల విన్యాసాలు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, చిన్నారుల సందడితో సంక్రాంతి పండుగ శోభ ఉట్టిపడుతుంది. 
 
 తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగలో భాగంగా కైట్ ఫెస్టివల్ గ్రాండ్ గా జరుగుతుంది. విదేశీ కైట్ ప్లేయర్స్ కూడా హైదరాబాద్ నగరానికి వచ్చి రంగురంగుల గాలిపటాలను ఎగురవేస్తూ సందడి చేస్తారు. గతంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్ జరిగింది. సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందేలు, తమిళనాడులో ఎడ్ల పందేలు, కేరళ రాష్ట్రంలో ఏనుగుల మేళా ప్రజల సంక్రాంతి పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: