సంక్రాంతి పండగ వచ్చిందంటే తెలుగు లోగిళ్లన్నీ కళకళ లాడుతుంటాయి. కొత్త పంటలు ఇంటికి రావడం, అల్లుళ్లు, కూతుళ్లు, మనుమలు... ఇంటి నిండా ఆత్మీయులు, సన్నిహితులు... అబ్బో... ఆ వేడుక చూడడానికి ఇంద్రుడికున్న వెయ్యి కళ్లు అద్దెకు తెచ్చుకున్నా కూడా చాలవేమో. పిల్లల ఆటపాటలు, బావలను ఆటపట్టించే మరదళ్లు, మామగారిని కోరికలు కోరే కొత్త అల్లుళ్లు, అందరికీ రకరకాల పిండివంటలు తయారుచేసే అమ్మమ్మలు, మేనత్తలు... ఇవన్నీ పండగ సంబరాలను ఆస్వాదించేలా చేస్తాయి. ఏ ఇంట చూసినా అరిసెల పాకం వాసన నాసికాపుటాలను సోకుతుంది. లోగిళ్లన్నీ ఉమ్మడి కుటుంబాలతో కళకళలాడతాయి. భోగి అంటేనే భోగమయిన పండగేమో అనిపిస్తుంది. ఈ పండగంత సంపన్నమైన పండగ మరొకటి లేదని నిరూపిస్తుంది. పూర్వం ఈ సమయానికి పంటలన్నీ చేతికి వచ్చి గాదెలు నిండి లోగిలి ధాన్య రాసులతో నిండి నిండు చూలాలులా ఉండేది. ఈ పండుగను వేడుకగా మూడు రోజులు చేసుకునే ఆనవాయితీ ప్రారంభం అయ్యింది. ఈ పండగకి మూడు రోజులూ ఇంటిల్లిపాదీ పనివారితో సహా కొత్త దుస్తులు కొనుక్కునేవారు.

 

ఈ పండ‌గ ఆంధ్ర ప్రాంత హిందువుల‌కు చాలా పెద్ద పండుగ‌. తెలంగాణ ప్రాంతంలో కూడా సంక్రాంతి పండుగ జ‌రుపుకుంటారు. కానీ నామ‌మాత్రంగా చేస్తారు. కానీ ఆంధ్ర‌లో సంక్రాంతి కోసం కొన్ని రోజుల నుంచి ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకుంటారు. ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో నివ‌శిస్తున్న ఆంధ్ర ప్రాంతం వారు సంక్రాంతి పండుగ‌కు వారి స్వ‌గ్రామాల‌కు వెళ్లేందుకు  మూడు నెల‌ల ముందే రైలు,  బ‌స్సు టిక్కెట్ల‌ను బుక్ చేసుకుంటారు. అంతేకాకుండా డిసెంబ‌ర్ చివ‌రి వారంలో హైద‌రాబాద్ లోని షాపింగ్ మాల్స్‌లో  ఆంధ్ర ప్రాంత ప్ర‌జ‌లు సంద‌డి చేస్తుంటారు. ప్ర‌తి ఒక్క‌రూ కొత్త బ‌ట్ట‌లు కొనుగోలు చేసుకుంటారు. కొంత మంది బంగారు ఆభ‌ర‌ణాల‌ను కూడా కొనుగోలు చేస్తారు. ఇక జ‌న‌వ‌రి 10వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 18వ తేదీ వ‌ర‌కూ త‌మ స్వ‌గ్రామాల్లో పండుగ సంబురాల్లో గ‌డుపుతారు. దీంతో ఈ 8 రోజులు హైద‌రాబాద్ రోడ్ల‌న్ని ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తాయి. దీంతో హైద‌రాబాద్ న‌గ‌రమంతా బోసిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: