సంక్రాంతి ముచ్చటైన పండుగ. చిన్నాపెద్దా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే వేడుక. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ కొత్త ఆనందాలను మోసుకొస్తుంది. తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు.

 

భోగి, సంక్రాంతి, కనుమ.. ఇలా మూడు రోజులు ప్రతి ఇంటా సంతోషమే. తొలి రోజు జరుపుకొనే భోగి పండుగకు ప్రత్యేకత ఉంది. భగ అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత.భోగి నాడు తెల్లవారుజామునే లేచి భోగిమంటలు వేయడం ఆనవాయితీ.

 

ఆవు పేడతో తయారైన పిడకలు, మామిడి, రావి, మేడి చెట్ల అవశేషాలు, తాటాకులు లాంటివి భోగి మంటల్లో వేస్తారు. అంతేకాదు ఇంట్లోని పాత వస్తువులను కూడా భోగి మంటల్లో వేస్తుంటారు. అంటే పనికిరాని చెత్త ఆలోచనలకు స్వస్తి పలికి.. కొత్తమార్గంలోకి పయనించాలని దీని అర్థం. భోగి రోజు చేసే బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం కూడా చేస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్లు పోస్తారు.

 

భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగి పళ్లను పిల్లల తల మీద పోడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపొతుంది.

 

తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది.కౌమర్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే.. 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: