తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. చిన్నాపెద్దా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే వేడుక. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ కొత్త ఆనందాలను మోసుకొస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ.. ఇలా మూడు రోజులు ప్రతి ఇంటా సంతోషమే. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరుగా క‌నిపిస్తుంది.

 

సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి సంక్రాంతి తరువాత వచ్చే పండుగ కనుమ అంటారు. తొలి రోజు జరుపుకొనే భోగి పండుగకు ప్రత్యేకత ఉంది. భగ అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత. ఇదిలా ఉంటే.. సాధార‌ణ రోజుల్లో ప్ర‌తి ఇంటి ముందూ చిన్న‌పాటి ముగ్గులు ద‌ర్శ‌న‌మిస్తాయి. 

 

అయితే, సంక్రాంతి నెల ప‌ట్టాక మాత్రం పెద్ద పెద్ద క‌ళ్లాపిలు చ‌ల్లి పెద్ద ముగ్గులు పెడ‌తారు. దీనికి శాస్త్రీయ కోణం స‌హా సామాజిక కోణం కూడా ఉంది. ఆవుపేడ‌లో క్రిమిసంహార‌కాలు ఉంటాయి. కొత్త పంట‌ల‌ను కోసే స‌మ‌యం కూడా ఇదే. దీంతో అప్ప‌టి వ‌ర‌కు పొలాల‌కే ప‌రిమిత‌మైన క్ర‌మిలు, కీట‌కాలు.. ఊళ్ల‌మీద‌కి దండెత్తుతాయి. ఇవి రాకుండా ఉండాలంటే.. ఆవుపేడ‌లోకి క్ర‌మిసంహార‌కాలు బాగా ప‌నిచేస్తాయి. దీంతో పెద్ద పెద్ద క‌ళ్లాపిలు చ‌ల్లుతారు. వీటిని తొక్క‌డం ద్వారా పాడై పోకుండా ఉండేందుకు పెద్ద పెద్ద రంగ‌వ‌ల్లులు తీర్చిదిద్దుతారు. త‌ద్వారా మాన‌వ ఆరోగ్యాన్ని ర‌క్షించే కోణం దీనిలో ఇమిడి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: