మన ఆడపడుచులు వేసే ముగ్గులకు ఎంత ప్రాధాన్యం ఉందంటే మాటల్లో వివరించలేనంతగా అంటే నమ్ముతారా?! పూర్వకాలంలో ఎవరింటి ముందు అయితే ముగ్గు లేదో వారిని బిచ్చగాళ్ళ లాగా భావించే వారట. నిజం ఎంటంటే.. ఎవరింటి వాకిలిలో అయితే ముచ్చటైన ముత్యాల ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట సాక్షాత్తు లక్ష్మీ దేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే ముగ్గులు వేయడం ద్వారా సైంటిఫిక్ బెనిఫిట్స్ లభిస్తాయని తేలింది. భోగి పండుగ రోజు వేసే ముగ్గులు ఇంకా గొబ్బెమ్మలు ఆవుపేడతో చేస్తాం కాబట్టి పాములు తేళ్లు రాకుండా ఉంటాయని.. అలాగే క్రిమికీటకాలు చచ్చిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక మకర సంక్రాంతి పండుగ సందర్భంగా వేసే చుక్కల ముగ్గులకు కూడా ఒక గొప్ప ప్రాధాన్యత ఉంది. అదేంటో ఈ ఆర్టికల్ ద్వారా మనం తెలుసుకుందాం..!


నిజానికి చుక్కల ముగ్గులు పెట్టడం ఒక కళ. కానీ అవి నక్షత్రాల నుంచి పుట్టాయన్న విషయం మీకు తెలుసా? ముగ్గులు వేయడం ద్వారా విశ్వంలో ఉన్న శక్తులను, దేవతలను, భూదేవిని.. ఇంకా చుక్కల ముగ్గు వేయడం ద్వారా నక్షత్ర మండలానికి అశేషమైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పండితులు చెబుతారు. చుక్కల ముగ్గు పెట్టేముందు ముందుగా చుక్కలను పెట్టి ఆ తర్వాత వాటిని కలుపుతూ ఉంటారు. విశ్వంలోని ఒక నక్షత్రం ఇంకొక నక్షత్రంతో కలవకుండా ఎలా ఉంటాయో వాటన్నింటినీ ముగ్గుల రూపంలో నేలపైన చూపిస్తారు మన స్త్రీలు. ఆకాశానికి నేల ప్రతిబింబం.. అలాగే పేడతో అలికినటువంటి నేలను ఆకాశానికి సంకేతంగా, ఇంకా దాని మీద పెట్టేటటువంటి చుక్కని నక్షత్రం గా భావిస్తారు పండితులు. అందుకే నక్షత్రాలకు చుక్క అనే పేరు వచ్చింది.


ఇకపోతే ఆడపిల్లలకు తన అమ్మ మొట్టమొదటిగా నేర్పేది 9 చుక్కల ముగ్గు. ఒక్కసారి మీరు ఆ 9 చుక్కల ముగ్గుని పరిశీలిస్తే.. అన్ని చుక్కలకు మధ్యలో ఉన్నది సూర్య గ్రహానికి చిహ్నం కాగా.. మిగతా తొమ్మిది చుక్కలు నవగ్రహాలను తెలియజేస్తాయి. ఇంకా నిశ్చింతగా చూస్తే సూర్యుని చుట్టూ ఉన్నటువంటి గ్రహాలన్నీ 9 చుక్కల ముగ్గులో స్పష్టంగా కనిపిస్తాయి. ఇంకా నాగ‌వ‌ల్లి, తాబేలు, కూర్మం, ర‌థం ముగ్గులు, మ‌త్స్య‌, మ‌ల్లెపందిరి ముగ్గుల‌కు కూడా విశేషం ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: