భోగి లేదా భోగి పండుగ అనునది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన అతి పెద్ద పండుగ. ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవుట వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది.


ధనుర్మాసములో వచ్చే భోగికి  భోగిపర్వం అని పేరు. అయితే భోగము అనే మాటకు అర్థం  అనుభవము అని. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా.. దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొండుతామో దానిని భోగము అనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం.


చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి. ఈ మంటలనే భోగి మంటలు అంటారు. భోగిమంటలకు ఎక్కువగా తాటి ఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులను భోగికి కొన్ని రోజుల ముందే కొట్టుకొని తెచ్చి భోగిమంటల కొరకు సిద్ధం చేసుకుంటారు. అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా భోగిమంటల కొరకు తాటాకు మోపులను ఇళ్ళవద్దకే తెచ్చి విక్రయిస్తున్నారు. వీటితో పాటు మంటలలో పనికిరాని పాత వస్తువులను ముందురోజు రాత్రికి సిద్ధం చేసుకుంటారు. తెల్లవారుజామున సాధారణంగా 3 గంటల నుంచి 5 గంటల మధ్యన ఎవరి ఇంటి ముందువారు ఈ మంటలు వేయడం ప్రారంభిస్తారు.


పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు, కాని భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత, ముగ్గువేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం, సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు, భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువు అంతా పారబోసి కడిగి ముగ్గువేయడం కొంచెం కష్టంతో కూడుకొన్నప్పటికి ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు. రోజు వేసే ముగ్గుల కన్నా ఈ రోజు మరింత అందంగా రంగు రంగుల రంగవల్లికలేస్తారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: