దక్షిణాయనానికి ఆఖరి రోజు భోగి. దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు, బాధలను భోగిమంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ప్రసాదించమంటూ ప్రజలు ప్రార్థిస్తారు. భోగి పండుగ మనలోని ఆశావహ దృక్పథానికి సంకేతం. ఆవు పేడ పిడకలు, మామిడి, రావి, మేడి వంటి చెట్ల అవశేషాలు, తాటాకులు, అప్పటికే కోసిన పంటల ఎండు అవశేషాలు వేసి రాజేసే ఈ మంటల్లో ఇంట్లోని పాత వస్తువులను ఈ మంటల్లోకి విసిరేస్తారు. ఎవరు ఎక్కువ వస్తువులు తెచ్చి మంటల్లో వేస్తే వారు గొప్పగా పరిగణిస్తారు. తెల్లవారు జామున వణికించే ఆ చలిలో చిన్నా పెద్దా అంతా చేరి చలిమంటలు కాచుకుంటారు.  కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగుభూమికి ఆనవాయితీగా కొంతమేర నీరు పారించి తడి చేస్తారు, ఒక పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కొరకు సాగుభూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు, ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు.

 

భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం ఈ రోజునే శ్రీ రంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని.. దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చింది. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన ఆయనను అక్కడ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమిచ్చాడనేది మరో కథనం. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: