సంక్రాంతి పండగ అంటేనే పందేలు అనే విధంగా తెలుగు రాష్ట్రాలలోని కొన్ని జిల్లాలలో పరిస్థితి ఉంటుంది. కొన్ని జిల్లాలలో కోడి పందాల జోరు, గుండాట పందెం జోరు మామూలుగా ఉండదు. సంక్రాంతి పండుగకు జరిగే పందేలలో గుండాట పందెం కూడా ఒకటి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఖమ్మం, నల్గొండ, గుంటూరు జిల్లాలలో ఈ గుండాట పందెం ఎక్కువగా జరుగుతుంది. కోడి పందేల బరి వద్ద ఎక్కువగా గుండాట పందేలను నిర్వాహకులు ఎక్కువగా ఏర్పాటు చేస్తారు. 
 
గతంలో ఈ గుండాట పురుషులకు మాత్రమే పరిమితమై ఉండగా ఇప్పుడు మహిళలు కూడా ఈ గుండాట పందెంలో పాల్గొంటున్నారు. కొంతమంది గుండాట పందేలలో పాల్గొనటానికి సంక్రాంతి సమయంలో ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి వస్తారంటే అతిశయోక్తి కాదు. గుండాట నిర్వాహకులు ఆరు పాచికలతో ఈ ఆటను నిర్వహిస్తారు. చతుర్భుజాకారంలో ఉండే పాచికకు 1 నుండి 6 చుక్కలు ఉంటాయి. 
 
పాచికలను ఒక బుట్టలో గిరగిరా తిప్పి బోర్డుపై బోర్లా ఉంచుతారు. అదే సమయంలో బల్లపై ఉండే 1 నుండి 6 సంఖ్యలపై జూదరులు డబ్బును పెట్టుబడిగా పెట్టి జూదం ఆడుతుంటారు. పాచికల్లో ఏ రెండు పాచి లు అయినా ఒకే రకమయిన సంఖ్య వస్తే ఆ సంఖ్యలో డబ్బు పెట్టిన వ్యక్తికి రెట్టింపు డబ్బులు ఇస్తారు. ఒకే రకమైన పాచిక మూడు పడితే మూడు రెట్లు, నాలుగు పడితే నాలుగు రెట్లు డబ్బులు వస్తాయి. 
 
గుండాట జోలికి వెళితే గెలిచేవారు చాలా తక్కువగా, ఓడిపోయేవారు చాలా ఎక్కువగా ఉంటారు. తక్కువ సమయంలోనే వేల రూపాయలు, లక్షల రూపాయలు పోగొట్టుకున్న వ్యక్తులు ఈ ఆట ఆడేవారిలో ఎక్కువగా ఉంటారు. పోలీసు యంత్రాంగం ఈ జూదాలను అరికట్టాల్సి చూసీచూడనట్లు వ్యవహరించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: