సంక్రాంతి వచ్చింది తుమ్మెద..సరదాలు తెచ్చింది తుమ్మెద..అవును నిజమే అప్పుడే పండుగ హుషారు స్టార్ట్ అయింది..భోగి మంటల్లో చలికాచుకోవాలని..సంక్రాంతి సంభరాలు చేసుకోవాలని..కనుమతో పండుగకి ఎలా ఎంజాయ్ చేయాలా  అని ఇప్పటికే చాలా ప్లాన్స్ చేసేసుకునుంటారు. తెలుగవారికి సంక్రాంతి, తమిళులకు పొంగల్ పేరు ఏదైనా పండుగ ఒకటే. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణించిన సనాతన హైందవ సంస్కృతిలో ప్రకృతి పరిశీలన, దాని ప్రభావాల అధ్యయనం కనిపిస్తాయి. సంక్రాంతి పండగ మూడు రోజుల పాటు జరుపుకుంటాం. మొదటి రోజు అంటే ఈ రోజు భోగి పండగ. భోగభాగ్యాలు అందించే రోజు ఇది.

 

రెండో రోజు సంక్రాంతి.. మూడో రోజు క‌నుమ అంటారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వచ్చిందంటేనే గొబ్బి పాటలు, గంగిరెద్దులు, రథం ముగ్గులు, భోగిమంటలు, బొమ్మల కొలువులు, పిండి వంటలు, కొత్త దుస్తులు.. వాటిని ధరించి చూడముచ్చటగా అలంకృతమైన ఆడపడుచులు కనివిందు చేస్తారు. మ‌రోవైపు లేలేత  సూర్యకిరణాల భూమిని తాకే వేళ, ఇంటి ముందు ఆడవారు ముగ్గులు పెట్టేవేళ,  రామదాసు కీర్తనలు, హరినామ సంకీర్తన, శ్రీ కృష్ణ లీలామృతాన్ని గానం చేసుకుంటూ కాలికి గజ్జెకట్టి తంబుర మీటుతూ, తలపై అక్షయ పాత్రతో  చేతిలో చిడతలతో  హరిదాసులు చేసే సంకీర్తనలు సంక్రాంతి పండుగవేళ కనిపించే అతి గొప్ప సాంప్రదాయాల్లో ఒకటి.

 

హరిదాసులు శ్రీమహావిష్ణువుకు  ప్రతిరూపాలుగా కూడా చెపుతారు. ఇంటి వారు ఇచ్చే ధన,ధాన్య,వస్తు, దానాలను తీసుకుని ఇంటింటికీ తిరుగుతూ హరిలోరంగ హరి..హరిలో రంగ హరి అంటూ ఇంటిముందు నర్తిస్తూ అందరినీ చల్లగా ఉండమని దీవిస్తూ గ్రామంలో తిరిగేవారు. అయితే వాస్త‌వానికి నేటి కాలంలో దాసుల సంఖ్య త‌గ్గిపోయింది. దీంతో అడ‌పాద‌డ‌పా మాత్ర‌మే వీరు క‌నిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: