రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్ద పండుగలలో సంక్రాంతి పండుగ కూడా ఒకటి. కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు, కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. రైతులు పంట చేతికొచ్చిన సందర్భంగా ఈ పండుగను చేసుకుంటారు కాబట్టి ఈ పండుగను రైతుల పండుగ అని కూడా అంటారు. ఈ పండుగ సమయంలో ఇళ్ల ముంగిళ్లను గొబ్బెమ్మలతో, రంగవల్లులతో అలంకరిస్తారు. 
 
కానీ సంక్రాంతి పండుగ చాలా మంది విషయంలో అప్పు చేసి అప్పు కూడు అనే సామెతను నిజం చేస్తోంది. చాలా మంది దూర ప్రాంతాల నుండి సొంతూళ్లకు ప్రయాణమవుతున్నారు. పండుగ సమయంలో చేతిలో ఎంత డబ్బు ఉన్నా టికెట్ రేట్లు పెంచి అమ్మడం వలన చేతిలో ఉన్న డబ్బులు ఖర్చులకే సరిపోతున్నాయి. మరోవైపు చిన్న కుటుంబంలో కూడా తల్లిదండ్రి, ఇద్దరు పిల్లల వస్త్రాలు, చిల్లర సరుకులు, వంటకాలకు 20,000 రూపాయలకు పైగా ఖర్చు అవుతోంది. సాధారణ, మధ్య తరగతి వర్గాలు చేతిలో అంత డబ్బు లేక అప్పులపాలవుతున్నారు. 
 
సంక్రాంతి సమయంలో విందూ వినోదాల కోసం కూడా భారీగా ఖర్చు చేయాల్సి వస్తూ ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులపాలవుతున్నారు. చేతి నిండా డబ్బులు ఉన్నవారు కూడా ఆకాశాన్ని అంటుతున్న ధరలతో అప్పు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. పెద్ద పండుగలలో ఒకటైన సంక్రాంతి పండుగకు అప్పు చేసి పప్పు కూడు తినాల్సి వస్తోందని సామాన్య, మధ్య తరగతి వర్గాలు బహిరంగంగానే అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: