తెలుగువారి అతి పెద్ద పండుగైన మకర సంక్రాంతి రానే వచ్చింది. మూడు రోజుల పాటు అందరం ఎంతో వైభవంగా జరుపుకునే ఈ పండుగకు ముందుగా వచ్చేది భోగి. ఈ బోగి రోజున తెల్లవారుఝామునే లేచి అందరూ కూడా తమ ఇళ్లలోని పాత వస్తువులను, భోగి మంటల్లో వేసి కాల్చేస్తుంటారు. అలా చేయడం వలన వాటిలోనే మన చెడు, జరిగిపోయిన చెడ్డ స్మృతులు వంటివి మంటల్లో దగ్ధమై అందరికీ మంచి జరుగుతుందని ప్రతీతి. ఇక ముఖ్యంగా ఈ భోగి పండుగ సమయంలో భోగి పళ్ళను పిల్లపై పోసి చిన్న వేడుక నిర్వహిస్తారు. 

 

అయితే ఈ విధంగా భోగి పళ్ళను, అనగా రేగిపళ్ళను వారిపై పోయడానికి ఒక కారణం కూడా వుంది. రేగు పండ్లను బదరీఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు  చేసిన సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాను కురిపించారని, ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను వారిపై పోసే సంప్రదాయం మొదలైందని అంటారు. ఇక ఆ రోజున సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలని, అలానే వారికి రాబోయే కాలం అంతా మంచి శుభాలు జరగాలని భావిస్తూ ఈ భోగిపండ్లను పోస్తారు. అయితే కౌమర్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే, కేవలం 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై మాత్రం ఎక్కువగా భోగి పండ్లను పోస్తారు.

 

భోగిపండ్ల వెనుక పిల్లవాడికి ఆ విష్ణుభగవానుడు, సూర్యభగవానుని ఆశీస్సులు ఉండాలని, అలానే అతడిని ఆవరించి ఉన్న దృష్టి దోషాలు తొలగిపోవాలనీ పెద్దల నమ్మకం అని, అలానే ఎటువంటి కుల పట్టింపులు లేకుండా అన్ని కులాల వారు ఈ పండుగను ఎంతో విశేషంగా జరుపుకుంటారని మన పెద్దలు చెప్తున్నారు. ఆ తరువాత రోజైన మకర సంక్రాంతి, ఆపై వచ్చే కనుమ రోజుతో సంక్రాంతి పండగ ముగుస్తుంది. ఈ మూడు రోజులు కూడా ఎటువంటి బాధలు, చెడు, ఇబ్బందులు లేకుండా అందరూ ఎంతో ఆనందోత్సాహాలతో ఈ పండుగ చేసుకుంటారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: