శబరిమలైవాసుడు.. మణికంఠుడి దర్శనం కోసం మాల ధరించిన భక్తులు ప్రతి ఏటా శబరిమల యాత్రకు వెళ్తుంటారు.  శబరిమలై, కేరళ రాష్ట్రంలోగల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప, హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు.  అయ్య అంతే విష్ణువు, అప్ప అంటే శివుడు అని పేర్ల సంగమంతో 'అయ్యప్ప' నామం పుట్టింది. అయితే అయ్య‌ప్ప స్వామి ఎలా జ‌న్మించారు..? అన్న ప్ర‌శ్న చాలా మందికి వ‌చ్చుంటుంది. క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు.

 

ఆ తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిథి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త (అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల కు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త. అయ్యప్ప స్వామి ధర్మప్రవర్తన, ధర్మనిష్ఠ లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. 

 

తన భక్తులు ఏయే ధర్మాలని పాటించాలో, ఏ నియమనిష్ఠలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అప్పటి నుండి ఆయన 'ధర్మశాస్త'గా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే ఆయనకి 'ధర్మశాస్త' అనే పేరు కూడా ఉంది. ఇక హరిహర సుతుడు అయ్యప్ప దీక్షా కాలం కార్తీకమాసంతోనే ప్రారంభమై.. మకరజ్యోతితో పూర్తవుతుంది. పద్దెనిమిది కొండల మధ్యలోని శబరిగిరి శిఖరంపై చిన్ముద్రధారిగా కొలువైన స్వామి దర్శనం కోసం దీక్ష  చేపట్టే భక్తులు 41 రోజులు కఠిన నియమాలను ఆనందంగా చేపడతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: