సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్ళ తోను..బంధు మిత్రులతోను కలకలలాడుతుంటాయి.  గొబ్బి పాటలు, గంగిరెద్దులు, హ‌రిదాసులు, రథం ముగ్గులు, భోగిమంటలు, బొమ్మల కొలువులు, పిండి వంటలు, కొత్త దుస్తులు.. ఇలా తెలుగు రాష్ట్రాలు క‌ల‌క‌ల‌లాడుతుంటాయి. 

 

అయితే సంక్రాంతి పండుగ నాడు కొత్త బ‌ట్ట‌లు క‌ట్టుకోవాల‌ని శాస్త్రం చెబుతోంది. అయితే, మిగిలిన పండ‌గ‌ల‌కు, సంక్రాంతికి చాలా వ్య‌త్యాసం ఉంది. సంక్రాంతి పూర్తిగా కృత‌జ్ఞ‌తా పూర్వ‌క పండుగ‌. మ‌న ఉద్ధార‌కులైన త‌ల్లిదండ్రుల‌కు న‌మస్కారం చేసుకుని, మ‌నం సంపాయించిన ప్ర‌తి రూపాయిని వారికి లెక్క చెబుతూ.. మ‌నం న‌మ్మిన దేవుడికి న‌మస్కారం చేస్తూ.. న‌ర జ‌న్మ‌ను ఇచ్చినందుకు ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌ల‌ను ఆవిష్క‌రిస్తూ.. మ‌నం కొనుగోలు చేసిన కొత్త బ‌ట్ట‌లు, కొత్త‌గా చేసుకున్న పిండివంట‌ల‌ను, ఆదాయ ద్ర‌వ్యాన్ని సైతం వారి ముందు ఉంచి.. వారికి స‌మ‌ర్పించుకుంటారు. 

 

ఇక ఆ త‌ర్వాతే.. మ‌నం కొత్త వ‌స్త్రాలు ధ‌రించాలి. భోగినాడు కొత్త వ‌స్త్రాలు క‌ట్ట‌కూడ‌ద‌ని లేక‌పోయిన‌ప్ప‌టికీ.. సంక్రాంతికి మాత్ర‌మే ప్రాధాన్యం ఉంది. మ‌రియు సంక్రాంతి రోజు ఉదయం నువ్వులు, బెల్లం తింటారు. బెల్లం లాగా తియ్యగా మాట్లాడుతూ, సహృదయంతో, పరోపకార బుద్ధితో జీవించాలని అర్థం. నువ్వుల నుండి నూనె వస్తుంది. నూనెకు స్నేహం అనే పేరుంది. స్నేహంగా అందరూ కలిసి మెలిసి జీవించాలని నువ్వులు చెప్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: