గ్రామాల్లో సంక్రాంతి సందడి అంతా ఇంతా కాదు.. ఇక చాలా ప్రాంతాల్లో సంక్రాంతి రోజుల్లో బొమ్మల కొలువులు నిర్వహిస్తారు. ఈ బొమ్మల కొలువుల్లో మన దేవుళ్లు, పురాణ పాత్రలు, గ్రామీణ వృత్తుల బొమ్మలు.. ఇలా అనేక రకాల బొమ్మలను కొలువుతీరుస్తారు. సాయంత్రం వేళల్లో ఈ బొమ్మలకొలువుల సందడి చాలా బావుంటుంది.

 

సంక్రాంతి .. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు ఇది అతి పెద్ద పండుగ. కేవలం ఈ పండుగ కోసమే పల్లెటూళ్లు ఎదురు చూస్తుంటాయి. పట్టణాలను పాకిన వలస జీవనాలు పండుగ వేళ తమ మూలాలను స్పృశిస్తాయి. ఎక్కడెక్కడికో బతుకుదెరువుకు వెళ్లినవారు కూడా తప్పకుండా సంక్రాంతికి సొంత ఊళ్లకు చేరడం సర్వసాధారణం.

 

ఇక సంక్రాంతి సెలవులంటే పిల్లలకు మరపురాని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. బాలల విషయానికి వస్తే సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. సంక్రాంతి రోజుల్లో ఆకాశాలు పతంగులతో సరికొత్త అందాలు సంతరించుకుంటాయి. పోటీపడి మరీ పెద్ద పెద్ద పతంగులు తయారు చేస్తారు. పతంగులను అత్యంత ఎత్తుకు ఎగరేస్తుంటారు. ఒకరి గాలిపటాన్ని మరొకరు పోటీపడి తెంపేస్తుంటారు.

 

ఇలా పిల్లలు, కుర్రకారు గాలిపటాల సందడికి అంతే ఉండదు. హైదరాబాద్ వంటి చోట్ల ప్రత్యేకించి సంక్రాంతి రోజుల్లో కైట్ ఫెస్టివల్స్ నిర్వహిస్తుంటారు కూడా. ఇలా బొమ్మరిళ్లు, పతంగులు సంక్రాంతి సందడిని రెట్టంపు చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: