సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ మాత్రమే కాదు.. మూడు తరాల జీవన విధానం. అయితే ఈనాటి పిల్లలకు పాత తరంపై అవగాహన ఉండదు. అందుకే.. సంక్రాంతిని కేవలం పండుగగానే చూడకుండా ఈతరానికి పాత తరాన్ని పరిచయం చేసే అవకాశంగా కూడా మలచుకోవాలి.

 

పల్లెటూళ్లలో పాతకాలం వస్తువులు ఇంకా చాలావరకూ సజీవంగానే ఉంటాయి. ఇప్పుడంటే అన్నీ కరంట్ వస్తువులు వచ్చాయి కానీ పాతకాలంలో అన్ని పనులు సొంత సామగ్రితోనే చేసేవారు కదా. అందుకే పిల్లలకు అవేమిటో చూపించాలి. నగరాల్లోని ఇళ్లలో ట్యాప్ తిప్పగానే నీళ్లు రావడమే ఈనాటి పిల్లలకు తెలుసు.

 

కానీ.. గ్రామాల్లో బావుల్లోని నీటిని గిలకల మీదుగా చేదుతారన్న విషయం ప్రత్యక్షంగా చూపించాలి. కిచెన్‌లో మిక్సీ, గ్రైండర్ వంటి ఉపకరణాలతో చేసే పనులను పల్లెల్లో ఇసుర్రాయి, రోలు, రోకలితో ఎలా చేస్తారో చూపించాలి. గ్యాస్ వంటలకు అలవాటు పడిన పిల్లలకు కట్టెల పొయ్యిలు, కుంపట్లు ఎలా పనిచేస్తాయో వివరించాలి.

 

అంతేనా.. పాలు, పెరుగు నిల్వచేసేందుకు వాడే ఉట్లు, వెన్న చిలికే కవ్వాలు, బియ్యం చెరిగే చాటలు, కూర్చునే పీటలు.. ఇలా ఎన్నో.. పల్లెటూరి పరికాలను పరిచయం చేయాలి. అసలు కరంట్ లేకుండా పాతకాలంలో పల్లెలు ఎలా జీవనం సాగించాయో వివరించాలి. అందుకు ఇందో మంచి అవకాశం.

మరింత సమాచారం తెలుసుకోండి: