భోగి త‌రువాత రోజు వ‌చ్చే సంక్రాంతి నుంచి శాస్త్రాల ప్ర‌కారం ఉత్త‌రాయ‌ణ పుణ్య‌కాలం ప్రారంభం అవుతుంది. సాధారణంగా సూర్యుని సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం మరొకటి దక్షిణాయణం. ఆరుమాసాల ఉత్తరాయణం దేవతలకు పగలు. దక్షిణాయణం రాత్రి. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. 
 
స్కంద పురాణం ప్రకారం సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన సంక్రాంతి రోజున ఎవడైతే స్నానం చేయడో అలాంటి వాడు ఏడు జన్మలు దరిద్రునిగా, రోగిగా మిగిలిపోతాడు. ఉత్తరాయణం పుణ్య కాలం అని ఎందుకు అంటామంటే ఉత్తరాయణంలో పరమ శివుడు మేల్కొని ఉంటాడు. మనం ఉత్తర దిక్కును, ఉత్తర భూమిని పవిత్రంగా భావించడం వలన నాగరికత, భాష, హైందవ సంస్ర్కృతి, సంస్కృతం భాష ఉత్తరాది నుండి రావడం వలన ఉత్తరయాణ కాలంను పుణ్యకాలంగా హిందువులు భావిస్తారు. 
 
దేవతలు ఉత్తరాయణం నందు మేల్కొని అడిగిన కోరికలను వెంటనే తీరుస్తారని పెద్దలు ఈ విషయాన్ని అందరికీ తెలియజేయటం కొరకు ఈ పండుగను మొదలుపెట్టారు. పురాణాలు ఈరోజు నుండి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పేర్కొన్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గ వాసం కలుగుతుందని ఆస్తిక లోక విశ్వాసం. 

మరింత సమాచారం తెలుసుకోండి: