తెలుగు వారు ఎంతో ఆనందంగా జ‌రుపుకునే పెద్ద పండ‌గ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, క‌నుమ ఇలా మూడు రోజులు ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటారు.  ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్ళ తోను..బంధు మిత్రులతోను కలకలలాడుతుంటాయి.  గొబ్బి పాటలు, గంగిరెద్దులు, హ‌రిదాసులు, రథం ముగ్గులు, భోగిమంటలు, బొమ్మల కొలువులు, పిండి వంటలు, కొత్త దుస్తులు.. ఇలా తెలుగు రాష్ట్రాలు క‌ల‌క‌ల‌లాడుతుంటాయి. ఇక ముఖ్యంగా కనుమ ను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. 

 

అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు. క‌నుమ ప్ర‌త్యేకంగా స‌ర‌దా సంతోషాల‌కు ప్ర‌తీక‌. పల్లెల్లో పశువులే గొప్పసంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంట పొలాలల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని గౌరవించి శుభ్రంగా అలంకరించి పూజించి, వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. పల్లె ప్రాంతాలలో కనుమ పండుగను వైభవంగా జరుపుకుంటారు.  కనుమ పండుగ స్పెషల్ తినటమే.తిండి కలిగితే కండ కలదోయ్..కండ కలవాడేను మనిషోయ్..అనే మాట ఈ కనుమ పండుకు సరిగ్గా సరిపోతుంది. 

 

ఈ నేప‌థ్యంలోనే ఆ రోజు ఎవ‌రికి న‌చ్చింది వాళ్లు తింటారు. అలాగే కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనం తయారు చేయడమే కాదు... దాన్ని అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది. అందుకే అక్కాచెల్లెళ్లు, అల్లుళ్లతో కలిసి ఈ కనుమ వేడుకని చేసుకుంటారు. ఇక ఈ రోజున‌.. కోడి పందేల‌కు, ఎడ్లు, పొటేళ్ల పందేల‌కు ప్ర‌త్యేక‌త ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. కుటుంబ స‌భ్యుల‌తో స‌హా ఆయా పందేలు జ‌రుగుతున్న ప్రాంతాల‌కు వెళ్లి వీక్షించి.. స‌ర‌దాను పంచుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: