దక్షిణ భారతదేశంలో అత్యంత మహిమాన్విత క్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయం. బాసర చదువుల తల్లి సరస్వతీదేవి కొలువున్న పవిత్ర ప్రదేశం. వ్యాసమహర్షి ప్రశాంత చిత్తంతో తపస్సు చేయడానికి వచ్చి బాసరలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు పురాణాలు చెబుతున్నాయి. నాటి నుండి నేటి వరకు బాసర సరస్వతీ అమ్మవారు విశేష పూజలను అందుకుంటున్నారు. ఈ క్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. 
 
బాసర ఆలయానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. వ్యాస మహర్షి బ్రహ్మాండ పురాణాన్ని రచిస్తున్నప్పుడు ప్రకృతి ఖండంలోని శక్తిని వర్ణించటానికి ప్రశాంత వాతావరణం అవసరం ఏర్పడింది. దీంతో ఆయన అన్ని ప్రాంతాలు తిరిగి బాసరకు చేరుకున్నారు. వ్యాస మహర్షి గోదావరి తీరంలో ధ్యానంలో ఉండగా శక్తి రూపం నీడలా కనిపించి వెనువెంటనే మాయమైంది. దీంతో ఆ రూపం ఎవరిదని తన దివ్యదృష్టితో వ్యాస మహర్షి చూడగా వ్యాస మహర్షికి జ్ఞాన సరస్వతి అమ్మవారు కనిపించారు. 
 
భూలోకంలోని కొన్ని పాపకార్యాల కారణంగా పూర్తి రూపం కనిపించటం లేదని దేవత వ్యాస మహర్షికి చెప్పింది. ప్రతిరోజు గోదావరిలో స్నానం చేసి పిడికెడు ఇసుకను నచ్చిన స్థానంలో వేయాలని అలా చేస్తే తన పూర్తి రూపం తయారవుతుందని దేవత చెప్పింది. వ్యాస మహర్షి కోనేరు ఎదురుగా ఉన్నచోట ఇసుకను వేయటంతో అమ్మవారి రూపం పూర్తి కావటం జ్ఞాన సరస్వతిగా ఆవిర్భవించటం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. విగ్రహానికి జీవం పోయటానికి తగిన శక్తి కలిగేందుకు సరస్వతి దేవి వ్యాసమహర్షికి జ్ఞాన బీజాన్ని ఉపదేశించింది. జ్ఞానానికి పుట్టుక బాసరలో జరిగినందున బాసర జ్ఞానానికి పుట్టుకగా వెలుగొందుతోంది. 
 
సరస్వతీ అమ్మవారి జన్మదినమైన వసంత పంచమి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. మహాభిషేకంతో పాటు అమ్మవారికి పల్లకీసేవ జరుగుతుంది. బాసరలో భక్తుల మనస్సు సేద తీర్చే ఎన్నో అధ్యాత్మిక క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వ్యాసులవారి మందిరం, దత్త మందిరం, వ్యాసుల వారి గుహ ఉన్నాయి. ఇక్కడ భక్తులను ఆకర్షించే ప్రాచీన మహేశ్వర ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం సమీపంలో ఉండే వేదవతి శిలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ శిలను తడితే వేరు వేరు శబ్దాలు వస్తాయి. సీతమ్మవారి నగలు ఉండటం వలనే ఇలాంటి శబ్దాలు వస్తాయని భక్తుల విశ్వాసం. 

మరింత సమాచారం తెలుసుకోండి: