గిరిపుత్రుల పండగ నాగోబా జాతర వైభవంగా జరుగుతోంది. ఆదివాసీలు తమ ఇలవేల్పు నాగేంద్రుడికి మొక్కులు సమర్పిస్తున్నారు. ముప్పై రోజుల పాటు జరిగే జాతరలో మూడవ రోజు భక్తులు పోటెత్తి ఇష్టదైవానికి పూజలు చేస్తున్నారు.  

 

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ భక్తజన సంద్రమైంది. నాగోబా జాతర కోసం... వివిధ రాష్ట్రాల నుంచి ఆదివాసీలు పోటెత్తుతున్నారు. ముత్నూర్ నుండి నాగోబా దేవాలయం వరకు ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. అటు వాహనాలు కూడా భారీగా రావడంతో... ట్రాఫిక్ జామ్ అయింది. ఊహించనిస్థాయిలో భక్తులు రావడంతో మరో మేడారాన్ని తలపించింది నాగోబా. 

 

గతంలో మొక్కిన కొరికలు తీర్చిన నాగేంద్రుడికి.. బెల్లం, పాడి ఆవులతో పాటు బంగారం, వెండి వస్తువులు సమర్పించుకున్నారు భక్తులు. దేశంలోనే రెండో పెద్ద గిరిజన పండుగగా గుర్తించిన సర్కార్‌ ప్రత్యేకంగా నిధులు సైతం మంజూరు చేసింది. ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నా... అధికారుల నిర్లక్ష్యం మరోసారి కనిపించింది. భారీగా వచ్చిన భక్తులు కనీసం తాగడానికి నీరు లేక అల్లాడుతున్నారు.  అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి కనీస వసతులు కల్పించాలంటున్నారు భక్తులు.

 

జాతరలో ముఖ్యఘట్టం ప్రజాదర్బార్‌ వైభవంగా జరుగనుంది.  ఆదివాసీలంతా పూజలు చేసి దర్బార్‌కు వస్తారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొంటారు. అందుకోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. 

 

మరోవైపు.. జాతరకు వచ్చిన ఆదివాసిీలు సంబరం చేసుకుంటున్నారు. రంగుల రాట్నాలు ఎక్కుతూ.. మిఠాయిలు, వస్తువులు కొనుగోలు చేస్తూ.. బంధువులతో మనసు విప్పి  మాట్లాడుతూ సందడి చేస్తున్నారు. నాగోబా జాతర ఏడాదికంతా జ్ఞాపకంగా ఉండిపోతుందంటున్నారు ప్రజలు. నాగోబా జాతరకు వచ్చే భక్తులు ఎంతో ఆనందంలో మునిగిపోయారు. తమ ఇష్టదైవాన్ని దర్శించుకోవడంతో పాటు మొక్కులు చెల్లించుకుంటున్నారు. పిల్లాపెద్దా అంతా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే కనీస సౌకర్యాలు సరిగా లేవంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: