రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబైంది. రేపు ఏడు వాహనాలపై మాడవీదుల్లో విహరించనున్నారు శ్రీవారు. ఇటు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని...ఆర్జిత సేవలు రద్దు చేసింది పాలకమండలి. తిరుమలలో రథసప్తమి వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్దం చేసింది టీటీడీ. మినీ బ్రహ్మోత్సవాలుగా పిలువబడే ఈ వేడుకలకు ఏడుకొండలు సుందరంగా ముస్తాబయ్యాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల్లో 16 వాహనాలపై మాడ వీధుల్లో శ్రీవారు విహరిస్తారు.. రథ సమప్తమి రోజున ఏడు వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. శనివారం తెల్లవారుజామున సుర్యప్రభ వాహనంతో మొదలయ్యే వాహన సేవ.. రాత్రి చంద్రప్రభ వాహనంతో ముగుస్తుంది. శ్రీనివాసుడు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. 

 

సప్తగీరుశుడు విహరిరంచే  ఆలయ మాడ విధులను రంగురంగుల హరివిల్లులతో శోభాయిమానంగా తీర్చిదిద్దారు. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే వాహనసేవలను భక్తులు తిలకించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో...అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసిన అధికారులు... ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలన్నింటిని రద్దు చేశారు. 

 

ఇటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏడు మార్గాల ద్వారా భక్తులను మాడ వీధులలోకి అనుమతిస్తారు. ప్రతి చోట మెటల్ డిటెక్టర్ ఫ్రేమ్ లను సిద్ధం చేశారు. ఇక గ్యాలరీలలో నుంచి బయటకు వచ్చేందుకు ఎగ్జిట్ ద్వారాలను ఏర్పాటు చేశారు. వాహనసేవల ముందు మూడెంచల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తానికి రథ సప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబయింది. భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల గిరులకు చేరుకున్నారు. రేపు జరుగబోయే రథసప్తమి వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని.. శ్రీవారిని దర్శించుకోనున్నారు. అంతేకాదు తమ ఇల దైవానికి మొక్కులు చెల్లించుకోనున్నారు. గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: