సమ్మక్క - సారక్క లను భక్తులు కష్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్న వారిని ఆడుకొనే ఆపద్భాంధవులుగా, వనదేవతలుగా పూజిస్తారు. కోయ గిరిజనుల ఉనికికోసం పోరాడి వీర మరణం పొందిన సమ్మక్క-సారలమ్మ జాతర ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుడు కాలం నుంచి కొనసాగుతున్నట్లు స్థలపురాణాలు చెబుతున్నాయి. ఆ కాలంలో మేడారం ప్రాంతాన్ని పడిగిద్దరాజు పరిపాలించేవారు.

 

మేడారం జాతర సందడి సుమారు పది రోజుల ముందు నుంచే మొదలవుతుంది. సారలమ్మ పూజారులు కన్నెపల్లిలోని గుడి వద్ద అమ్మ వారిని పూజించి సమ్మక్క దేవతపూజారులైన సిద్దబోయిన వారింటికి వస్తారు. సమ్మక్క పూజారులు చిలుకల గుట్ట వద్దకు వెళ్ళి దేవతను కుంకుమ భరిణ రూపంలో తీసుకువస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు 10 రౌండ్లు తుపాకీ కాల్పులు జరిపి దేవతను గద్దెకు తీసుకు వస్తారు. భక్తుల మొక్కుబడుల అనంతరం తిరిగి దేవతలు వనప్రవేశం చేస్తారు. నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యద్ద స్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యముగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారము(బెల్లము) నైవేద్యముగా సమర్పించుకుంటారు.

 

జంపన్న వాగులో పుణ్యస్నానాలు మేడారానికి వచ్చే భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేయనిదే వెళ్లరు. ఇక్కడ స్నానం చేస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. గద్దెల వద్ద ఎంత మంది భక్తులు ఉంటారో జంపన్నవాగు సమీపంలో అంతే మంది ఉంటారు. అది కుంభమేళాను తలపిస్తుంది. జంపన్నవాగు ఒడ్డునే తలనీలాలు సమర్పించడం సంప్రదాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: