చంద్రుడు మఖ నక్షత్రంలో ఉండే మాసం కాబట్టి, దీనిని మాఘమాసంగా నానుడి. 'మఘం' అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు శ్రేష్ఠమైన మాసంగా దీనిని భావిస్తారు. మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కాబట్టి ఇది మాఘమాసమైంది. ఇక మాఘమాసంలో స్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది. దీన్ని పవిత్రస్నానంగా భావించి, పాప పరిహారం కోసం నదీస్నానాలు చేయడం మాఘ మాసం సంప్రదాయం. మాఘస్నానాలు సకల కల్మషాలను హరిస్తాయని నానాటినుండి.. హిందూ భారతీయుల విశ్వాసం.

 

ఈరోజు అనగా.. ఫిబ్రవరి 9 ఆదివారం రోజు మహామాఘి, మాఘ స్నానంతో పాప పరిహారం, ఆరోగ్య ప్రాప్తి! పుష్కలంగా కలుగునని శాస్త్రాలు చెబుతున్నాయి, మాఘమాసంలో సూర్యుడు స్థానం ప్రకారం, ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుకుంటాయి.ఈ సమయంలో సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. మాఘస్నాన మహాత్మ్యం గురించి బ్రహ్మాండ పురాణం తెలిపింది. మృకండు మహర్షి-మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలం వల్లే వారి కుమారుడైన మార్కండేయుడు మృత్యువును జయించాడని పురాణ కథనం.

 

జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేస్తే మరింత శ్రేష్ఠమని ఆధునిక శాస్త్రవేత్తలు సైతం పేర్కొంటున్నారు. మాఘ స్నానాలకు అధిష్ఠానదేవత సూర్యనారాయణుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక పరంపరగా వస్తోంది.

 

ఇక మాఘ పూర్ణిమను 'మహామాఘం' అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకం. "అఘం" అనే పదానికి సంస్కృతంలో "పాపం" అని అర్థం. మాఘం అంటే పాపాలను నశింపజేసేది అని ప్రతీతి. అందుకే తెలుగు నెలల్లో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవుడికి ఎంతో ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు. శివుడు, విష్ణువు ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతుంటాయి. కావున వ్రతాలు చేయ బూనిన వారు నిస్సంకోచంగా చేసుకోవచ్చని పురోహితుల సలహా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: