ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో నెలకొన్న ప్రసిద్ద శైవ క్షేత్రము శ్రీశైలం. హరహర మహదేవ శంభో శంకరా అంటూ నిత్యం లక్షలాది మంది భక్తులు శివుడ్ని కొలుస్తూ ఉంటారు. నల్లమల అడవుల్లో కొండ గుట్టల మధ్య ఉన్న శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్ర౦. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి. ఇక్ష్వాకులు, పల్లవులు, విస్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, శివాజీ లాంటి ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం శ్రీశైలం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన పుణ్యక్షేత్రం ఇది. 

 

నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు,అత్యద్భుతమైన కట్టడాలుగా ఇక్కడి దేవాలయాలను నిర్మించారు. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది,అష్టాదశ శక్తి పీఠములలో ఆరవది, మరియు దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది. శ్రీశైలం చరిత్రకు ఆధారాలుగా ఉన్న శాసనాల్లో మొదటిది క్రీ.శ.6వ శతాబ్ది నాటిది. ఆరవ శతాబ్ది నాటి మైసూరులోని కదంబరాజుల తాల్గుండి శాసనంలో మొదటిసారి శ్రీశైలం పేరు కనిపించింది. 

 

శ్రీశైలానికే సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతము, శ్రీశైలము మొదలైన పేర్లు ఉన్నాయి. శ్రీ అనగా సంపద, శైల౦ అంటే పర్వతం కనుక శ్రీశైలమంటే సంపద్వంతమైన పర్వతమని అర్ధం వస్తుంది. దీనికి శ్రీకైలాసం అనే పేరుతో పూజలు నిర్వహించారు. క్రీ.శ.1313లోని ఒక శాశనాన్ని అనుసరించి దీనికి శ్రీ కైలాసము అనే పేరూ పెట్టారు. మహేశ్వరులు శ్రీకైలాసము (శ్రీశైలం) పైన నివసించారు అని పలు ఆధారాలు ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ గ్రంథాల్లో దీని ప్రశంస విస్తారంగా కనిపిస్తోంది. క్రీ.శ.6, 7 శాతాబ్దాల నాటి తమిళ శైవ గ్రంతం తేవరంలో అస్పర్, సుందర్, నమ్మందర్ అనే పేర్లున్న భక్తకవులు శ్రీశైలాన్ని గురించి ప్రస్తావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: