శివోహం...హిందువులు శివాలయాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. భారత దేశ వ్యాప్తంగా ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. అయితే వీటన్నిటికంటే కూడా అత్యద్భుతమైన అత్యంత పురాతనమైన చరిత్ర కలిగిన శివాలయాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. తెలుగువారికి ఎంతో దగ్గరగా వరాలుగా ఉన్న ఈ శైవక్షేత్రాలు పంచారామాలుగా పేరొంది, అయిదు క్షేత్రాలు తెలుగు నేలపైనే గమనార్హం. అయితే అసలు పంచారామాల ఎలా ఉద్భవించాయి..?? పురాణ ఇతిహాసాలు  పంచారామాల చరిత్ర ఏమి చెప్తున్నాయో ఇప్పుడు చూద్దాం...

 

శ్రీనాధుని భీమేశ్వర పురాణం:

 పురాణాల ప్రకారం.. శ్రీనాధుడు రచించిన భీమేశ్వర పురాణంలో ఈ పంచారామాల ఉద్భవం గురించి ఉన్న ఓ కథ ఇది. క్షీరసాగర మధన సమయంలో వచ్చిన అమృతాన్ని, విష్ణుమూర్తి మోహినీ అవతరమున దేవతలకు, అసురులకు పంచుతున్నారు. ఈ పంపకమ సమయంలో తమకు అన్యాయం జరిగిందని భావించిన అసురులు  త్రిపురనుల నాధుల నేతృత్వంలో గట్టి తపస్సులు ఆచరించగా, బోళా శంకరుడైన పరమశివుడు, వారి తపస్సుకు మెచ్చి, వారికి విశిష్ట వరములిచ్చెను. అది మొదలు, కొత్త శక్తులను పుంజుకున్న  అసురులు అనేకానేక రకములుగా దేవతలను హింసిస్తున్న సమయంలో  దేవలంతా మహాశివుని దగ్గర మొరపెట్టుకున్నారు. వారి మొరను ఆలకించిన శివుడు, అసురులపై ఆగ్రహంతో అందరిని సంహరించెను. ఈ సమయంలో శివుని రుద్రరూపమే త్రిపురాంతకునిగా పిలువబడుతున్నది. అయితే ఇంతటి దేవాసుర యుద్దంలోనూ త్రిపురాసురులచే పూజించబడిన ఒక శివలింగము మాత్రం చెక్కుచెదరలేదు. ఈ శివలింగాన్నే, శివుడి 5 భాగాలుగా ఛేదించి 5 వేరు వేరు ప్రదేశాలలో ప్రతిష్టించాడని అలా లింగ ప్రతిష్ట జరిగినవే పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయని ఓ కథ.  

 

స్కాంద పురాణం:

 స్కాంద పురాణం ప్రకారం ఈ పంచారామాల ఉద్బవం గూర్చిన ఓ కథ...తారకాసురుడు అను ఒక రాక్షసుడు శివుని కోసం ఘోర తపస్సుని ఆచరించెను. అతను భక్తికి ముగ్ధుడైన పరమశివుడు ప్రత్యక్షమై అతను కోరుకున్న విధముగానే శివుని ఆత్మలింగాన్నీ, అతని మరణము ఓ బాలుడి చేతిలోనే వస్తుందని వరము ప్రసాదించెను. వరగర్వితుడైన తారకాసురుడు దేవతలు మిక్కిలి బాధింపసాగాడు. సామాన్య బాలుడి చేతిలో ఈ పరాక్రమశాలుడైన తారకాసురుడు వధనం జరగదని గ్రహించిన దేవతలందరు పార్వతీ పరమేశ్వరుల  దగ్గరకు వెళ్లి, వారి బాధలన్నీ చెప్పుకొని తమకోక శక్తివంతుడైన బాలుడిని ప్రసాదించి ఆ తారకాసురిని సంహరించమని మొరపెట్టుకున్నారు. అలా కుమారస్వామి పార్వతీ మాత గర్భాన జన్మించి, తారకాసురుని సంహరించెను. అట్టి సమయములో తారకాసురుని లో ఉన్న ఆత్మ లింగము ముక్కలుగా అయి 5 వేరు వేరు ప్రదేశాలలో పడ్డాయని . ఈ ప్రదేశాలే నేడు పంచారామాలుగా ప్రసిద్ది చెందాయని స్కాంద పురాణ గాథ. అయితే ఈ 5 ప్రదేశాలలో వివిధ దేవతలు లింగాలను ప్రతిష్టించారని కూడా ఈ పురాణంలో ఉంది. అవి.

 

 

అమరారామము:

ఇది గుంటూరు జిల్లా, అమరావతిలో ఉంది. ఇక్కడి లింగాన్ని సాక్షాత్తు దేవతల అధిపతైన ఇంద్రుడు ప్రతిష్టించాడనేది స్థల పురాణం. అందుకే ఆ ప్రాంతానికి ఇంద్రలోక రాజధాని అయిన అమరావతి అనే పేరు వచ్చిందని అంటుంటారు. ఇక్కడ శివలింగము 16 అడుగుల ఎత్తున ఉంటుంది. ఇక్కడ కొలువైన శివుడు అమరలింగేశ్వరుడిగా పుజలందుకుంటాడు. అయితే ఈ శివ దర్సనం కోసం రెండంతస్తులు ఎక్కి దర్శించుకోవాలి...

 

ద్రాక్షారామము:

ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లలో రామచంద్రాపురానికి అతి సమీపంలో ఉంటుంది. పంచారామలలోనే అత్యంత ప్రాముక్యతను సంతరించుకున్న శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందించి. పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన చోటు కావడం చేత దీనికి దాక్షరామము అని పేరు వచ్చింది, కాలక్రమేణా ఇది ద్రాక్షరామంగా పిలువబడుతోంది. ఇక్కడ శివుడిని భీమేశ్వరస్వామిగా కొలుస్తారు. ఆయన సహచరిణి మాణిక్యాంబ అమ్మవారిని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఎన్నో విశిష్టతలు కలిగిన శివాలయం ఇది.

 

సోమారామము:

ఈ  క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరానికి అతి దగ్గరలో ఉన్న గునుపూడి అనే గ్రామంలో ఉంది. ఇక్కడ స్వామివారు సోమేశ్వరుడిగా, అమ్మవారు రాజరాజేశ్వరి గా పూజలందుకుంటారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం లింగాన్ని, చంద్రుడు ప్రతిష్టించాడట. ఈ ఆలయానికి ఇంకో విశిష్టత కూడా ఉంది, ముములుగా ఇక్కడ శివలింగం, తెలుపు,నలుపు రంగుల్లో ఉంటుంది. కాని అమావాస్య రోజున మాత్రం ఇది గోధుమ వర్ణంలోకి మారుతుంది, మళ్ళి పౌర్ణమి నాటికి మాములు రంగులలోకి వచ్చేస్తుంది. దీనిని అక్కడి భక్తులు అంత్యంత అద్భుతంగా భావిస్తారు. అయితే రెండంతస్తులలో ఉండే ఈ క్షేత్రంలో స్వామీ వారు కింద అంతస్థులో పుజించబడితే, అమ్మవారు మాత్రం పై అంతస్థులో పూజలందుకుంటారు.

 

కుమారభీమారామము:

ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లా లోని సామర్లకోటకు అతి సమీపంలో ఉంది. ఇక్కడి స్థల పురాణం ప్రకారం, సాక్షాత్తు కుమారస్వామే ఇక్కడి లింగాన్ని ప్రతిష్టించాడట. ఇక్కడ శివుడిని కుమారభీమేశ్వరుడిగా పిలుస్తారు. ఈ ఆలయాన్ని చాళుక్య రాజైన భీముడు నిరమించాడని అందుకే ఈ ప్రదేశానికి కుమారభీమరామంగా పేరుందాని ఒక ప్రతీతి. ఈ ఆలయ విశిష్టత ఏమిటో తెలుసా, చైత్ర వైశాక మాసాల్లోని సూర్యకాంతి ఉదయము వేళలో అయ్యవారి పాదాలను, సాయం వేళలో అమ్మవారి పాదాలను తాకుతుందట.

 

క్షీరారామము:

ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో ఉంది. ఇక్కడి స్థల పురాణం ప్రకారం లింగాన్ని సాక్షాత్తూ శ్రీరామచంద్రుడే ప్రతిష్టించాడని, అందుకే ఇక్కడి శివుడిని రామలింగేశ్వరుడు అంటారని ప్రసిద్ధి. ఇక్కడ శివలింగము తెల్లటి పాలురంగులో ఉంటుంది, అందువాలనే ఈ స్వామిని క్షీరరామలింగేశ్వరుడు అని కూడా అంటారు. అంతేకాదు శివలింగం పై భాగములో కాస్త మొనదేలి ఉంటుంది, అందువల్ల ఈయనను కొప్పురామలింగేశ్వరుడు  అని కూడా పిలుస్తారు.

 

ఇంతటి విశిష్టతను కలిగిన పంచారామలను దర్శించుకున్న యెడల అష్టైస్వర్యాభివృద్ది కలుగుతుందని అందరి నమ్మకం. అన్ని క్షేత్రాలు ఒకే రాష్ట్రంలో ఉండటం వల్ల  ఒకే రోజు దర్శించుకోవచ్చు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ఆర్.టీ.సీ. వివిధ బస్సులను కూడా నడుపుతోంది. వందల సంవత్సరాల విశిష్ట శిల్ప కళలతో, వేల సంవత్సరాల స్థల పురాణాలతో ఈ పంచారామాలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ పంచారామాలు దర్శించుకోవాలని అనుకునే వారు ముందుగా

 

తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోటలోని కుమారభీమారామము నుంచీ మొదలు పెట్టి.. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం లో గల ద్రాక్షారామము సందర్శించి  అక్కడి నుంచీ పాలకొల్లు లోని క్షీరారామము దర్శించుకుని మరలా అక్కడికి దగ్గరలో ఉన్న భీమవరం సోమారామము స్వామిని దర్శించుకుని గుంటూరు జిల్లా అమరావతి లో ఉన్న  అమరారామము  లోని స్వామిని దర్శించుకోవాలి. అయితే ఈ పంచారామాలు అన్నిటిని ఒక్క రోజులోనే దర్శించుకోవాలని అప్పుడే దర్సన పుణ్యం శివుని ప్రీతిని పొందుతారని చెప్తున్నాయి పురాణాలు..ఒక వేల అమరారామము  నుంచీ యాత్ర మొదలు పెడితే అమరారామము  - సోమారామము – క్షీరారామము – ద్రాక్షారామము – కుమారభీమారామము మీదుగా వెళ్ళవచ్చు..

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: