మహాశివరాత్రి పర్వదినానికి కోటప్పకొండ క్షేత్రం ముస్తాబవుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. త్రికూటేశ్వర స్వామి తిరునాళ్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విద్యుత్‌ ప్రభలు ఇప్పటికే స్వామి సన్నిధికి పయనమయ్యాయి. మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. 

 

రాష్ట్రంలోనే ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటైన కోటప్పకొండ గురించి తెలియని వారుండరు. ఇక్కడ కొలువై ఉన్న  శ్రీ త్రికూటేశ్వరుని భక్తులు కొంగు బంగారంగా కొలుస్తారు. కోటప్ప స్వామిని దర్శించుకుంటే ఎలాంటి కష్టమైనా తీరిపోతుందని భక్తుల నమ్మకం. 

 

త్రికూటేశ్వరుని మేధా దక్షిణామూర్తిగా పిలుచుకుంటారు. దక్షయజ్ఞం ముగిసిన తర్వాత ఆ పరమ శివుడు మేధా దక్షిణామూర్తిగా ఇక్కడ వెలసినట్లు పురాణం చెబుతుంది. స్వయంభువుగా వెలిసిన  త్రికూటేశ్వరునికి.. రాజు, మల్రాజు వంశస్థులు ఆలయం నిర్మించినట్లు శాసనాల ద్వారా స్పష్టమవుతుంది. పర్వతాల మధ్య స్వామివారు అవతరించినందున ఈ ప్రాంతానికి త్రికూటాద్రిగా పేరొచ్చింది. 

 

ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం నాడు ఇక్కడ తిరునాళ్లు అత్యంత వైభవంగా జరుగుతాయి. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా వచ్చి కొండపై జాగారం చేస్తారు. భక్తుల రద్దీ ఏటికేడు పెరుగుతూనే ఉంది. ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు స్వామి వారి తిరునాళ్లలో పాలుపంచుకుంటారు. రకరకాల అలంకరణలతో.. అంబరాన్ని తాకే విద్యుత్‌ ప్రభలు కోటప్పకొండ తిరునాళ్ల ప్రత్యేకం.

 

వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కోటప్పకొండ తిరునాళ్లకు రాష్ట్ర పండుగ హోదా కల్పించారు. దీంతో ప్రతి ఏటా ప్రభుత్వ ఖర్చుతో మహాశివరాత్రి జాతర జరుగుతుంది. కోటప్పకొండ అభివృద్ధికి 10 కోట్ల రూపాయలతో టీటీడీ వేద పాఠశాల, యాత్రికులకు వసతి సదుపాయాలు ఘాట్‌రోడ్డు నిర్మాణం జరిగింది. ప్రస్తుతం నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మెట్ల మార్గం సమీపంలో శివుడి బొమ్మ ప్రతిష్టించారు. 

 

తిరునాళ్లకు వచ్చే భక్తులకు పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. కొండ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. కొండకు వచ్చే భక్తులు పెట్లూరివారిపాలెం-కోటప్పకొండ రోడ్డును వినియోగించుకుంటే బస్ స్టాప్ వరకు తేలికగా చేరుకోవచ్చంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: