ఈ ప్రపంచం అంతా శివమయమే కాబట్టి, ఈ లోకంలో తానూ ఉన్నందుకు మనిషికి ‘సాలోక్య ముక్తి’ లభిస్తుంది. శివుడితో మానసికమైన అనుసంధానం ఉంటుంది. ఆ కారణంగా ‘సాయుజ్య ముక్తి’ లభించినట్లే. ఇలా శివుడి పూజ వల్ల చతుర్విధ ముక్తులనూ ఇహలోకంలోనే పొందుతున్న మనిషి ధన్యుడు.

 

శివుడి అర్చనలోని వస్తువులన్నీ ఆయన ప్రసాదించినవే. శివ జటాజూటంలోని గంగానది నీళ్లను అనుగ్రహిస్తుంది. శివుడి నేత్రమైన సూర్య కిరణాల వల్ల పూలు లభిస్తున్నాయి. శివుడి తలపైన గల చంద్రుడి దయతో పండ్లు లభిస్తున్నాయి. బిల్వదళాలు చేతికి అందుతున్నాయి. అవన్నీ శివ ప్రసాదాలే!

 

ఇలా శివుడు ఇచ్చిన సంపదలన్నింటినీ ఆయనకే అర్పించడం శివార్చన. దాని పరమార్థం- ఈ ప్రపంచంలోని సంపదలన్నీ స్వార్థం కోసం కాదని, అవి సమస్త ప్రాణుల సుఖ సంతోషాల కోసం పరమేశ్వరుడు సృష్టించినవని గ్రహించడం. మానవ జీవనం భోగమయం కారాదని, త్యాగమయం కావాలని తెలియజేసేదే మహాశివరాత్రి!

 

అనునిత్యం మంగళకరమైన భావాలను మనిషి తన ఎదలో పదిలం చేసుకోవాలి. జీవితాన్ని ఒక పూజా కుసుమంలా రూపొందించాలి. తనలో అందరిని, అందరిలో తనను చూసుకొని ఈ ప్రపంచాన్ని శివుడిగా భావించడమే అతడి కర్తవ్యం. మహాశివరాత్రి పర్వదినం అందజేసే సందేశం ఇదే! ఈ శివభావనతో పరమశివుణ్ని ఆరాధిస్తేనే, లోకమంతా శివమయం అవుతుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: