త్వరలోనే మహా శివరాత్రి సమీపిస్తున్న వేళా పరమేశ్వరుని గురించి ఒక గొప్ప విషయం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.



ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు కొంత సమయం గడిపేందుకు మానస సరోవరముకి వెళ్తారు. ఆ సందర్భంలోనే... ఏకాంత సమయం దొరికింది కదా అని... పరమేశ్వరుని ఒక సామాన్య ఇల్లాలు లాగా ఆటపట్టిదామని పార్వతీదేవి అనుకుంటారు. అనుకున్నట్టుగా తను మాట్లాడుతూ... 'స్వామి, మీకు అమ్మ నాన్న లేరు కదా! ప్చ్, పాపం,' అంటూ పెదవి విరుస్తూ చాలా జాలిగా నటిస్తారు.


పార్వతి దేవి మాటలకు పరమేశ్వరుడు బిగ్గరగా విరగబడి నవ్వుతూ... 'దేవి, నాకు అత్తామామలు ఉన్నారు. నీకు వారు కూడా లేరు కదా! ప్చ్, పాఫామ్', అంటూ బ్రహ్మాండంగా నటిస్తారు.




అప్పుడు పరమేశ్వరుని మాటలకు బదులుగా ఏం సమాధానం ఇవ్వాలో తెలియక పార్వతి దేవి సందిగ్ధతలో పడిపోతారు. తరువాత మాట్లాడుతూ... 'అందుకే కదా, స్వామి! మిమ్మల్ని అందరూ భోళా శంకరుడు అని పిలుస్తారు. మీరు లేనిదాని గురించి బాధ పడకుండా... ఉన్న దానిలోనే ఆనందం వెతుక్కొని సంతోషంగా జీవితాన్ని గడుపుతూ అందరికీ మార్గదర్శకంగా నిలుస్తారు', అంటూ ప్రేమగా చెబుతారు.



ఇదంతా విన్న పరమేశ్వరుడు బదులిస్తూ... 'అదేంటి దేవి, నువ్వేదో అన్నావని నేను కూడా కోప్పడిపోయి నాలుగు మాటలు అంటే... ఇక ఆలుమగలు అనుబంధానికి అర్థము, విలువ ఏముంటుంది?'



'నీకు తెలియక ఏదైనా మాట జారినా, పొరపాటు చేసినా... ఓ తల్లి లాగా ఆదరించి, ఒక తండ్రిలాగా గద్దించి... నీ నుంచి ప్రేమను పంచుకొని, నీకు ప్రేమను పంచుతానని మన వివాహం అయ్యేటప్పుడు ‘ధర్మేచ - అర్థేచ- కామేచ- మోక్షేచ- నాతిచరామి', అని నీకు ప్రమాణం చేశానని గుర్తులేదా! మన ముందు తరాలనే కాకుండా మన కుమారుల భవిష్యత్తుకు కూడా మార్గదర్శకులు అయ్యేవిధంగా మనం నడుచుకోవాలి కదా. ఆలుమగలు అన్న తర్వాత భర్త తప్పు చేస్తే భార్య అతడిని సరైన మార్గంలో నడిచే విధంగా ప్రవర్తించాలి. దంపతులలో ఈ బాధ్యత కేవలం ఒకరి మీదే ఉండదు. మనలో ఒకరు తక్కువ అని, ఒకరు ఎక్కువ అని ఏమీ ఉండదు. దేవుళ్ళ సాక్షిగా ఏర్పడుతున్న వివాహ బంధములో బంధుత్వాలు, బాధ్యతలు, సుఖదుఃఖాలు, గెలుపోటములు అనే ఎన్నో అగ్ని ప్రశ్నలు ఎదురవుతాయి. దానినే మనం పరిపూర్ణ దాంపత్యం అని పిలుస్తాము. అవన్నీ విజయవంతంగా ఎదుర్కొని ఆలుమగలు దాంపత్యాన్ని అందంగా మలుచుకోవాలి', అని అంటారు.



స్వామివారి మాటలను విన్న పార్వతీదేవి 'మీరు ప్రమాణం చేసినట్టు మీలో (అర్థేచ) సగభాగాన్ని నాకు ఇచ్చి, నాకు మరో గౌరవాన్ని ప్రసాదించారు', అని అంటారు.

 


అప్పుడు శివుడు నవ్వుతూ... 'అయ్యో, దేవి. నేనేం అంత గొప్ప వాడిని కాదు. శ్రీ మహావిష్ణువు తన భార్య లక్ష్మీదేవికి తన గుండెలోనే స్థానం ఇచ్చాడు. అదీ అసలు సిసలైన ప్రేమంటే. నాదేముంది', అంటూ పార్వతీదేవి వైపు కొంటెగా చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతారు.




దీంతో బుంగ మూతి పెట్టుకున్న పార్వతీదేవి... 'అరే, మా ఆయనకు నేను గొప్ప, మా అన్నయ్యకి ఏమో తన భార్య గొప్ప', అని అంటారు.



వెంటనే మహాశివుడు పార్వతి దేవి చెంతకు చేరి 'అయ్యో దేవి, అలా బుంగ మూతి పెట్టుకొని అలగకు', అంటూ బుజ్జగించే పనిలో నిమగ్నమవుతారు.



చూశారా?! అంతటి దేవదేవుల్లే వారి దాంపత్య బంధంలో అలకలు వస్తే ఒకరినొకరు ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా బుజ్జగిస్తున్నారో? అలా ఒకరి ఆలోచనలకు మరొకరు గౌరవిస్తూ ఉంటే ఏ దాంపత్య బంధం అయినా ఫెవిక్విక్ అతికించినంత గట్టిగా తయారవుతుంది. కానీ నేటి కాలంలో భర్త అంటే భార్యకు విలువ ఉండదు భార్యంటే భర్తకు విలువ ఉండదు. అందుకే భర్త ఒక మాట అంటే భార్య నాలుగు మాటలు అనే ఈ రోజుల్లో ఆదిదంపతులైన పార్వతీ-పరమేశ్వరుల దాంపత్యలు, ఇంకా ఇతర దేవదేవుళ్ళ దాంపత్య లు ఎంత గొప్పగా ఉన్నాయో ఒకసారి తెలుసుకోవడం చాలా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: