మహాశివరాత్రి వ్రతాన్ని మాఘబహుళచతుర్దశి నాడు ఆచరించాలి. తెలిసికాని, తెలియకగాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పుంచుకొని ముక్తి పొందుతారు. ఈ వ్రత ప్రాశస్త్యం తెలిపే వ్రత కథ ఉంది. అదేమిటంటే..

 

ఒకప్పుడు ఒక పర్వతప్రాంతమున హింసావృత్తిగల వ్యాధుడొకడు ఉన్నాడు. అతడు ఒకరోజు అడవియంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటిపడుతున్న సమయలో అతనికొక తటాకము కనిపించింది. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను, కాయలను విరిచి క్రింద పడవేయసాగెను.

 

మొదటిజామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చింది. వ్యాధుడు దానిపై బాణము వేయబోయాడు. లేడి భయపడక "వ్యాధుడా! నన్ను చంపొద్దు.. నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను. హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరిచాను. దానికి రుద్రుడు కోపించి కామాతురయైన నీవు, నీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాపవిముక్తులౌదురని సెలవిచ్చాడు. నేను గర్భిణిని నన్ను వదలుము. మరొక పెంటి జింక ఇచటికి వచ్చును. దానిని చంపు. నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువుల కప్పగించి తిరిగివస్తాను" అని అతన్ని వొప్పించి వెళ్లింది.

 

రెండో జామున మరొక పెంటి జింక కనిపించింది. ఆ జింక కూడా.. ఓ వ్యాధుడా, నేను విరహముతో కృశించియున్నాను. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక వస్తుంది. దానిని చంపు, కానిచో నేనే తిరిగివత్తును" అన్నది. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టాడు. మూడోజామున ఒక మగ జింక అక్కడికి వచ్చింది. వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను.

 

అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటి జింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞచేసి వెళ్ళినవి, నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని "నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞపొంది మరలివత్తును అని ప్రమాణములు చేసి వెళ్లింది. ఇలా నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను.

 

కొంతసేపటికి ఆ నాలుగు జింకలును వచ్చి నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లాయి. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడ్డాడు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగింది. "ఓ మృగములారా ! మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను అని చెప్పి ధనుర్బాణములను పారేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

 

అంతలో దేవదూతలు ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిపించి ఇలా అన్నారు.. " ఓ మహానుభావా.. శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది. ఉపవాసము, జాగరమును జరిపితివి, తెలియకయే యామ, యామమునను పూజించావు. నీవెక్కినది బిల్వవృక్షము. దానిక్రింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగుపడి యున్నది. నీవు తెలియకయే బిల్వపత్రముల త్రుంచివేసి శివలింగాన్ని పూజించావు. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళు..అని చెప్పారు. ఇదీ మహాశివరాత్రి ప్రాశస్త్యం తెలిపే కథ.

మరింత సమాచారం తెలుసుకోండి: