సంక్రాంతి పండగ తర్వాత వచ్చే పండగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. ఏటా మాఘమాసం కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజునే శివుడు లింగరూపంలో ఉద్భవించాడని, శివపార్వతుల కళ్యాణమని అంటారు. అన్ని పండగలు పగటి పూట జరుపుకుంటే ఈ పండగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శణమిచ్చే పవిత్ర పర్వదిన కాలం. ఇక శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం.

 

భక్తులు ఈరోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులూ చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు. ఏడాది పొడుగునా ఏ పూజలూ చేయనివారు కూడా మహా శివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్ధించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కధలు ఉన్నాయి. అలాగే మనదేశంతో పాటు వివిధ దేశాలలో మహా శివరాత్రి పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు. నేపాల్‌లో కూడా మహాశివరాత్రి అక్క‌డ హిందువులు ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటారు.  నేపాల్‌లో.. కోట్లాది హిందువుల ప్రఖ్యాత `పశుపతినాథ్ ఆలయం` వద్దకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి శివరాత్రికి హాజరు అవుతారు. 

 

అయితే ఈ దేవాలయంలోకి హిందువుల‌ను మాత్ర‌మే అనుమతిస్తారు. నేపాలి ప్రజలకు ఈ దేవాలయం చాలా పవిత్రమైనది. దేవాలయము ప్రక్కనే  బాగమతి నది ఉంటుంది. ఆ న‌ది ఒడ్డున ఆర్యాఘాట్ అనే ప్రదేశంలో శ్మశాన వాటిక ఉంటుంది. ఈ పశుపతినాథ్ దేవాలయానికి నేపాల్ దేశం నుండేగాక‌ భారత దేశం నుండి కూడా వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకంటారు. మహాశివరాత్రి రోజు పశుపతినాథ్ దేవాలయం నేతి దీపపు కుందులతో కన్నులపండుగా ఉంటుంది. మ‌రియు భక్తులు శివరాత్రి రోజు బాగమతి నదిలో స్నానము చేసి, శివరాత్రి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: