బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడినట్లుగా 'శివ' అనే పేరులోని 'శి' అనే అక్షరం పాపాలను హరింపజేస్తుంది. 'వ' అనే అక్షరం ముక్తిని ప్రసాదిస్తుంది. "శివ" అంటే చాలు పాపాలన్నీ నశించి మోక్షం సిద్ధిస్తుంది. ఒక్క శివ నామంలోనే ఇంత శక్తి ఉంటే, నాలుగు విధాల శివరాత్రులను జరుపుకుంటే లెక్కలేనంత ఫలం లభిస్తుందని శాస్త్ర వచనం. అయితే ఈ నాలుగు ఆచరించలేకపోయినా, కనీసం ఒక్క మహాశివరాత్రిని పాటించినా అన్ని శివరాత్రులను ఆచరించిన ఫలం లభిస్తుంది. ఒక్క శివరాత్రి వ్రతం సర్వపాపాలను హరించి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇంత గొప్ప శివ‌రాత్రి సంద‌ర్భంగా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన శివుని విగ్ర‌హం గురించి తెలుసుకుందాం...

 

ఓజిలి మండలంలోని సగుటూరు గ్రామంలో క్రీ.శ. ఆరో శతాబ్దం నాటి పురాతనమైన మానవ రూపం కలిగిన విగ్ర‌హం ఈ శివుని విగ్రహం. దీనిని చరిత్ర పరిశోధకులు రసూల్‌ గుర్తించారు. చెన్నైలోని పురావస్తు శాఖ అధిపతి ఏసుబాబు దీన్ని ధ్రువీకరించారు. వెంకటగిరి సంస్థానంలో ప్రధాన తాలూకా కేంద్రంగా ఈ సగుటూరు గ్రామం ఉండేది. గొబ్బూరు రాజ వంశీయుల తరువాత వెలుగోటి వారి పాలనలో ఈ ప్రాంతం ఉండేది. ఈ గ్రామ సరిహద్దులోని చింతాళమ్మ గుడి ప్రాంగణంలో మూడు అడుగుల ఎత్తు కలిగి మానవ రూపంలో ఉన్న శివుని విగ్రహాన్ని గుర్తించారు. ఈ విగ్రహానికి ఉన్న రెండు చేతుల్లోనూ త్రిశూలం, ఢమరుకం, మరో రెండు చేతుల్లో ఖడ్గం, కపాలం పట్టుకుని కింద భాగంలో రెండు వైపులా నాగలింగాకారంతో, తలపై నాలుగు పడగల సర్ప భూషితుడై అత్యంత సుందరంగా ఈ విగ్రహం ఉందన్నారు.  ఈ విగ్ర‌హాన్ని చూడ‌టానికి రెండు క‌ళ్ళూ చాల‌వ‌ట అంత అత్య‌ద్భుతంగా ఉంటుంద‌ట‌. 

 

దక్షిణ భారతదేశంలో మరెక్కడా ఇలా శివుని విగ్రహం లేదని తెలిపారు. ప్రాచీనమైన ఈ విగ్రహం నేడు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉంది. ఈ పరిసర ప్రాంతాల్లో అపురూపమైన శిల్ప సంపద శిథిలమై ఉంది. పురావస్తు శాఖ వారు తక్షణమే స్పందించి తగు చర్యలు చేపడితే పురాతనమైన ఈ శిల్ప సంపదను కాపాడవచ్చని చరిత్ర పరిశోధకుడు రసూల్‌ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: