హిందువులు, ముఖ్యంగా శివ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగ మహా శివరాత్రి. అన్ని పండగలు పగటి పూట జరుపుకుంటే ఈ పండగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శణమిచ్చే పవిత్ర పర్వదిన కాలం. శివ అనగా మంగళకరము, శుభప్రదము. శివరాత్రి అంటే మంగళకరమైన శుభప్రదమైన రాత్రి. రాత్రి `చీకటి` అజ్ఞానమునకు సంకేతం కదా, మరి ఇది మంగళకరమైన రాత్రి ఎలా అవుతుంది? శివరాత్రి నాడు ఉపవాసము, జాగరణ, మహేశ్వర దర్శనం, అభిషేకం, బిల్వార్చన, నామ సంకీర్తనల వలన అజ్ఞానం తొలగి అనగా చీకటి తొలగి జ్ఞాన వెలుగు ద్యోతకమవు తుంది. 

 

అందుకే అది శివరాత్రి, మహాశివరాత్రి. ప్రతి మాసంలోనూ అమావాస్యకు ముందు వచ్చే చతుర్ధశిని, మాస శివరాత్రి పిలుస్తారు. మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రి అని పిలుస్తారు. శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం ఐదు. అవి.. నిత్య శివరాత్రి, పక్షశివరాత్రి, మాసశివరాత్రి, మహాశివరాత్రి, యోగశివరాత్రి. వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి. మార్గశిరమాసంలో బహుళ చతుర్థి, అర్ద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది. శివునికి అతి ఇష్టమైన తిథి అది. 

 

అందుకే ఈరోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట. ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివకళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహా శివరాత్రి రోజున ప్రాతఃకాలాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి. శివుడు.. భోళా శంకరుడు. పత్రం పుష్పం ఫలం తోయం.. వీటిలో ఏది సమర్పించినా స్వీకరిస్తాడు. భక్తి శ్రద్ధలతో తనను కొలిచే భక్తులను ఆనందంగా అనుగ్రహిస్తాడు.. జన్మానికో శివరాత్రి అంటారు  గానీ, మహాశివరాత్రి పర్వదినం ఏటేటా వస్తూనే ఉంటుంది. మనలో నిద్రాణమైన భక్తిని  జాగృతం చేస్తూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: